సీపిఎం నాయుకుడుని పోలీసులు బలవంతంగా ఎత్తుకెలుతున్న దృశ్యం.
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ) : వంశధార నిర్వాసితులందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయలేరని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు టి.తిరుపతిరావు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. నగరంలోని డేఅండ్‌నైట్ కూడలి వద్ద ఆదివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితుల సమస్యల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
వంశధార నిర్వాసితులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు అరెస్టులతో భయపెట్టాలని చూస్తుందన్నారు. 2005 నుంచి ఇప్పటి వరకు ఆర్‌ఆర్ ప్యాకేజి, యూత్ ప్యాకేజిలు ఇవ్వకుండా సర్వేల పేరుతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నిర్వాసితుల పట్ల ద్వంద్వ వైఖరిని అవలంభిస్తుందన్నారు. నిర్వాసిత కుటుంబానికి ఐదు సెంట్లు స్థలమిచ్చి ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2009లో ఇచ్చిన నిర్వాసితుల జీవోను అమలు చేయాలని కోరారు. నిరసన చేస్తున్న వారిని అరెస్టు చేసి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉదయం పది గంటలకు అరెస్టు చేసిన వీరిని మధ్యాహ్నం 2 గంటల సమయంలో వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. నిరసనలో సీపీఎం నాయకులు డి.గణేష్, వై.చలపతిరావు, బి.లక్ష్మి, బి.సత్యంనాయుడు, ఎన్.కనకమహలక్ష్మి, ఎల్లమ్మ, సూరమ్మ, లలిత, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.