పెరవలి : జిల్లాలో సాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవలసిన బాధ్యత ఇరిగేషన్ అధికారులదేనని, మీరంతా ఏం చేస్తున్నారని ఇరిగేషన్ అ«ధికారులను కలెక్టర్ కాటంనేని భాస్కర్ నిలదీశారు. నీరు సమృద్ధిగా ఉన్నా సాగు నీరు అందకపోవటానికి కారణమేమిటని ప్రశ్నించారు. పెరవలి లాకుల వద్ద మంగళవారం ఉదయం ఆయన నీటి ప్రవాహాన్ని పరిశీలించి అధికారులను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. పెరవలి లాకులకు ఏటాలాగే 1,200 క్కూసెక్కుల నీరు విడుదలవుతున్నా నీరు పొలాలకు ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు. చిన్న, పిల్ల కాలువలకు నీరు ఎక్కకపోతే వంతుల వారీ విధానం ప్రవేశపెట్టి సాగునీరు సక్రమంగా అందించాల్సిన బాధ్యత మనదేనన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమస్యను పరిష్కరించి సాగునీరు సక్రమంగా ఇవ్వాలని ఆదేశించారు