ప్రత్యామ్నాయం సరే.. ధరేది?
-
గిట్టుబాటు ధరల్లేకుండా ప్రత్నామ్నాయ పంటల సాగు సాధ్యమా?
-
రైతు సంక్షేమ నిధి లేకుండా ఎన్ని మాటలు చెప్పినా వృథా
-
కౌలు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది
-
వ్యవసాయానికి రాత్రి పూట కరెంట్ ఇవ్వడం రైతు సంక్షేమా..?
-
సమస్యలు ఏకరువు పెట్టిన జిల్లా రైతు సంఘాలు, రైతులు
-
రైతులతో వ్యవసాయశాఖ కమిషన్ టాస్క్‌పోర్సు కమిటీతో ముఖాముఖి
-
సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్న కమిటీ చైర్మన్ ఎస్.గాలబ్
ఒంగోలు టూటౌన్ :
వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నియమించిన వ్యవసాయ కమిషన్ టాస్క్ పోర్సు కమిటీ గురువారం జిల్లాకు వచ్చింది. ఇప్పటి వరకు తొమ్మిది జిల్లాలో పర్యటించిన అనంతరం ప్రకాశం జిల్లాలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా రైతుల సమస్యలను వినేందుకు ఒంగోలులోని అంబేద్కర్ భవనంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా రైతులు, రైతు సంఘ నాయకులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను, గిట్టుబాటు ధర , పాలకుల నిర్లక్ష్యాన్ని వ్యవసాయ కమిషన్ టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ ఎస్.గాలబ్ దృష్టికి తీసుకువచ్చారు.
బీమా ప్రీమియం తగ్గించాలి..
కమిటీ సభ్యులు, ప్రొపెసర్ డాక్టర్ నరసింహరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక అధ్యక్షుడు చుండూరి రంగారావు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలో పదోవంతుకు కూడా ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించడం లేదని తెలిపారు. 2004 నుంచి 2016 వరకు వరి ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతులు పొలాల్లోనే క్వింటా రూ.850 తెగనమ్ముకోవాల్సి వచ్చిందని తెలిపారు.
పంటల బీమాలో మిర్చి, పత్తికి నిర్ణయించిన ప్రీమియం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని రొయ్య రైతులకు నాసిరకం సీడ్ విక్రయించడం వలన ఒక్కొక్క చెరువుకు రూ.2 లక్షల వరకు నష్టపోయినట్లు తెలిపారు. పొగాకు, శనగలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపినా«ద్ తెలిపారు. జిల్లాలో వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పథకాలు, రాయితీలు అమలు కావడం లేదని తెలిపారు. కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షుడు పెంట్యాల హనుమంతరావు మాట్లాడుతూ నీరు చెట్టు పేరుతో పేదలు సాగు చేసుకుంటున్న కుంట.. అరకుంట భూములను ప్రభుత్వం లాగేసుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అదే ప్రభుత్వం భూములను పెద్దల చేతిలో ఉంటే వారి జోలికి వెళ్లడం లేదని తెలిపారు. 425 జీవో తెచ్చి దేవాదాయ భూములను హిందువులకు మాత్రమే కౌలుకు ఇస్తామని ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన పని వలన మతపరమైన దాడులకు పురిగొల్పినట్లువుతోందని తెలిపారు. వెంటనే ఆ జీవోని రద్దు చేయించాలని డిమాండ్ చేశారు. ఏపీ రైతు సంఘం నాయకులు పమిడి వెంకట్రావు మాట్లాడుతూ జిల్లాలోని ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం వలన రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారని తెలిపారు.
అమలు కాని ఒప్పంద ధర లు...
అబ్బూరి వెంకటేశ్వర్లు అనే రైతు మాట్లాడుతూ జామాయిల్, సుబాబుల్ కొనుగోళ్లలో ఒప్పంద ధర ఏ నాడు అమలు కాలేదని తెలిపారు. గిట్టుబాటు ధర లేకుండా ప్రత్యామ్నాయ పంటల సాగు ఎలా చేస్తారని రైతు శ్రీనివాసరావు, రాత్రి పూట కరెంట్ ఇవ్వడం రైతు సంక్షేమం ఎలా అవుతుందని ఆనం ఆదినారాయణరెడ్డి ప్రశ్నిం చారు. జిల్లాలో పంటలకు పందుల బెడద ఎక్కువగా ఉందని పలువురు రైతులు కమిషన్ ముందు వాపోయారు. పొలం చుట్టు కంచె వేసుకుంటనే పూర్తి స్థాయి సబ్సిడీ ఇప్పించాలని కోరారు. ఇంకా బీజేపీ నాయకుడు బత్తిన నరసింహరావు, రైతులు బ్రహ్మయ్య, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి యర్రమోతు శ్రీనివాసరావు, కొండ్రగుంట వెంకయ్య, సుపరిపాలన వేదిక నాయకులు గోపాల్‌రెడ్డి, జయంతిబాబు, ఎన్.శ్రీనివాసమూర్తి ఇంకా పలువురు రైతులు సమస్యలను ఏకరువు పెట్టారు.
కమిషన్‌కు తెలియజేస్తాం..
అనంతరం కమిషన్ టాస్క్ పోర్స్ చైర్మన్ ఎస్.గాలబ్ మాట్లాడుతూ రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి వ్యవసాయ కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ టాస్క్ పోర్స్ సభ్యులు ప్రొపెసర్ పృధ్వీరెడ్డి, కె.వెంకటరెడ్డి, వి.వి.శాస్త్రి, వ్యవసాయశాఖ జేడీ జె.మురళీకృష్ణ, పశు సంవర్ధకశాఖ జేడీ డాక్టర్ యన్.రజనీకుమారి, ఉద్యానశాఖ ఏడీలు యం.హరిప్రసాద్, పి.జెన్నెమ్మ, మత్స్యశాఖ, మార్కెటింగ్ శాఖ, పట్టు పరిశ్రమ, గ్రౌండ్ వాటర్ డిప్యూటి డైరెక్టర్, ఏపీఎంఐపీ ఏపీడీ, డీఆర్‌డీఏ పీడీ, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పీడీ పోలప్ప, ఐటీడీఏ పీవో, జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ సిహెచ్ నరసింహరావు, నాబార్డు ఏజీఎం, పీడీసీసీబీ బ్యాంకు జీఎం, జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు, దర్శి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ డీడీ, ఏడీఏలు, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.