పసుపు.. కుంకుమ.. సొమ్మేదమ్మా!
డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి మొహం చాటేసిన ప్రభుత్వం మహిళల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తడంతో అడపాదడపా కొద్దిపాటి సొమ్మును విదిలిస్తోంది. ఇందులో భాగంగానే రెండో విడతగా పసుపు.. కుంకుమ పేరుతో డ్వాక్రా మహిళల ఖాతాల్లో రూ.3 వేల చొప్పున జమ చేస్తున్నట్టు ప్రకటించింది. సంక్రాంతి కానుకగా ఈ సొమ్ములు ఇస్తున్నట్టు ప్రకటించడంతో ఆ మొత్తాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని గ్రూపుల ఖాతాల్లో సొమ్ములు జమ కాగా, కొన్ని గ్రూపులకు అందటం లేదు. సొమ్ము వచ్చిందో లేదో తెలుసుకునేందుకు మహిళలు రెండు రోజులుగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కొన్ని బ్యాంకుల్లో డ్వాక్రా మహిళలను లోనికి అనుమతించడం లేదు. దీంతో వారు గంటల తరబడి రోడ్లపైన.. బ్యాంకుల ఆవరణలోను వేచి ఉంటున్నారు. తమ ఖాతాల్లో నగదు జమ అయ్యిందో లేదో స్పష్టంగా తెలియజెప్పాలని.. జమ అయిన సొమ్మును తీసుకునేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మంగళవారం పెదవేగిలోని ఇండియన్ బ్యాంక్ వద్ద డ్వాక్రా మహిళలు పడిన అవస్థలకు అద్దం పట్టే చిత్రాలివి.
పెదవేగి రూరల్