ఇదెక్కడి న్యాయం?
Published Sun, Jul 31 2016 10:31 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
సాక్షి, విజయవాడ :
విజయవాడ నగరంలో ఆక్రమణలు, విగ్రహాల తొలగింపులో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అందరికీ విస్మయం కలిగిస్తోంది. ఓ సామాజికవర్గంపై ప్రేమ చూపుతున్న పాలకులు, అధికారులు ఇతర వర్గాలకు సంబంధించి దారుణంగా వ్యవహరించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే 40 ఆలయాలను కూల్చివేసిన ప్రభుత్వం తాజాగా పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్‌లోని స్వాతంత్య్ర సమరయోధుడు టి.వి.ఎస్.చలపతిరావు విగ్రహాలను శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత అమానుషంగా తొలగించింది. ఇప్పుడు నగర వాసులు ఏ ఇద్దరు కలిసినా విజయవాడలో జరుగుతున్న ఈ అరాచకంపైనే చర్చిస్తున్నారు.
అరాచక పాలన
విజయవాడ రూపురేఖలను సమూలంగా మార్చేస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ఆలయాల విధ్వంసం, విగ్రహాల తొలగింపు అరాచకపాలనను తలపిస్తోంది. ఒక సామాజికవర్గానికి, టీడీపీ వారికి ఒక న్యాయం, ఇతరులకు వేరొక న్యాయంలా అధికారులు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కెనాల్ రోడ్డులోని సెంట్రల్ వాటర్ కమిషన్‌కు చెందిన జలభవన్‌ను అడ్డగోలుగా కూల్చివేశారు. చివరికి ఆ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో పని చేసేందుకు ప్రత్యామ్నాయం కూడా చూపలేదు. గోశాల, కృష్ణాతీరంలో సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి ఆలయానికి హైకోర్టు స్టే ఉన్నా అడ్డగోలుగా కూల్చివేశారు. కృష్ణా నదీతీరంలో ఉన్న అనేక మంది పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు తమ ఇళ్లు కూల్చవద్దంటూ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా అధికారులు పట్టించుకోలేదు. వారి ఇళ్లను కూల్చివేశారు.
ఎన్టీఆర్ విగ్రహాలు కనిపించవా?
ఆలయాలు, పేదల ఇళ్లు, ప్రభుత్వ భవనాలను అడ్డగోలుగా కూలుస్తున్న అధికారులు ఓ సామాజికవర్గం, టీడీపీ నాయకుల ఆస్తులవైపు మాత్రం కన్నెత్తి చూసేందుకే భయపడుతున్నారు. పటమట సర్కిల్, అజిత్‌సింగ్‌నగర్ సర్కిల్‌లో ఎన్టీఆర్ విగ్రహాలు ఉన్నాయి. ఇవి ట్రాఫిక్‌కు ఇబ్బందిగా ఉండడంతో తరచూ వాహనాల రాకపోకలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. వాటిని తొలగించే సాహసం అధికారులు చేయడంలేదు. రామవరప్పాడు రింగ్ రోడ్డులో టీడీపీ కార్పొరేటర్‌కు చెందిన ఒక హోటల్ ఉంది. ఇన్నర్ రింగ్‌రోడ్డుకు స్థలం అవసరమైన సమయంలో అధికారులు ఆ హోటల్ భవనం తొలగించకుండా, సమీపంలోనే ఉన్న మసీదు, పూరి పాకలను తొలగించడంపై గతంలో సర్వత్రా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇక బందరు రోడ్డులో ఒక ప్రయివేటు కార్యాలయ భవనం ఉంది. రోడ్డు విస్తరణ కోసం ఆ ప్రాంతంలో ఉన్న అన్ని భవనాలను తొలగించిన అధికారులు, ఆ ప్రయివేటు కార్యాలయ భవనాన్ని మాత్రం వదిలేశారు. ఆ భవనం తొలగింపునకు కోర్టు స్టే ఇబ్బంది అయితే, కెనాల్ రోడ్డులోని కేంద్ర ప్రభుత్వానికి చెందిన జల భవన్‌ను స్టే ఉన్నా ఎందుకు తొలగించారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అంటే కోర్టు ఉత్తర్వులు ట్రాఫిక్ ఇబ్బందుల కంటే కక్ష సాధింపు చర్యలే కీలకంగా మారాయని నగర ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు.
చంద్రబాబు కంటే వైఎస్సారే మేలు
ముఖ్యమంత్రి చంద్రబాబు కంటే వైఎస్సారే మేలని ఆ పార్టీకి చెందిన ఒక ఎమెల్సీ ఇటీవల బహిరంగంగానే వాపోయారు. ఆ ఎమ్మెల్సీ కుటుంబానికి గతంలో ఇంద్రకీలాద్రిపై ఆరు దుకాణాలు ఉండేవి. అప్పట్లో ఇంద్రకీలాద్రిపై దుకాణాలను తొలగించాలని అధికారులు భావించినప్పుడు వ్యాపారులంతా తమ జీవనోపాధి పోతుందని స్థానిక కాంగ్రెస్ నేతల ద్వారా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దృష్టికి తీసుకెళ్తే, వాటి జోలికి వెళ్లకుండా దుకాణాలను కొనసాగించారని ఆ ప్రజాప్రతినిధి గుర్తుచేసుకున్నారు. ఇప్పుడు తాను బీసీ సామాజికవర్గానికి చెందిన వాడినని కూడా చూడకుండా తమ ఆరు దుకాణాలను ఈ ప్రభుత్వం కూలగొట్టించిందని ఆవేదన చెందారు. ఇప్పుడు కూడా తమ ఇంటి రేటు తగ్గించేందుకు అర్జున వీధిని రాజవీధిగా ప్రకటించి వాహనాలు రాకపోకలకు సర్వీస్‌రోడ్డు వేయడం ద్వారా ఈ ఏరియాలో భవనాలు రేట్లు తగ్గేలా ప్రభుత్వం చేస్తోందంటూ తన సన్నిహితుల వద్ద ఆ నేత పేర్కొంటున్నారు. గోశాల వద్ద పరిశీలనకు వచ్చిన బీజేపీ నేతలు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలోనూ పై అంశాలను ఆ నాయకుడు ప్రస్తావించడం గమనార్హం.
Advertisement
Advertisement