అధికారులతో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల
- ఖమ్మం మేయర్‌ను, అధికారులను ప్రశ్నించిన మంత్రి తుమ్మల
గండుగులపల్లి(దమ్మపేట): మారుమూల గ్రామాల్లో కూడా మరుగుదొడ్లు నూరు శాతం పూర్తి అవుతున్నాయని, ఖమ్మం కార్పొరేషన్, మిగిలిన మున్సిపాలిటీల్లో.. ఎందుకు జాప్యం జరుగుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఖమ్మం మేయర్ పాపాలాల్‌ను, అధికారులను ప్రశ్నించారు. శుక్రవారం మండల పరిధిలోని గండుగులపల్లి తన నివాసంలో ఉన్న మంత్రి తుమ్మలను మేయర్‌తోపాటు, జిల్లాలోని పలు శాఖల అధికారులు వచ్చి కలిశారు. ఈ సందర్బంగా తుమ్మల మాట్లాడారు. కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో పన్నులు సక్రమంగా వసూలు చేయాలని, పన్నులు వసూళ్లుంటేనే అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. అధికారులు నిబద్ధతతో పనిచేయాలని, అక్రమాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. పాలేరు నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో అక్రమ విద్యుత్ కనెక్షన్లున్నాయని, వాటిని వెంటనే క్రమబద్ధీకరించాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈ రమేష్‌ను ఆదేశించారు. ట్రాన్స్‌కో ఎస్‌ఈగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న రమేష్ ఈ సందర్భంగా మంత్రిని కలిశారు. మంత్రి తుమ్మలను కలసిన వారిలో డీసీసీబీ డైరక్టర్ పాలా నర్సారెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు పైడి వెంకటేశ్వరరావు, డొడ్డాకుల రాజేశ్వరరావు, నాయకులు పోతినేని శ్రీరామవెంకటరావు, దొడ్డాకుల గోపాలరావు, పసుమర్తి చంద్రరావు, కాసాని నాగప్రసాద్, ఎండీ వలీపాష, కురిశెట్టి సత్తిబాబు, రెడ్డిమళ్ల వెంకటేశ్వరరావు తదితరులున్నారు.