అండర్ బ్రిడ్జిలు, సర్వీస్ రోడ్ల కోసం ఉద్యమం
- ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
నెల్లూరు(వేదాయపాళెం): జాతీయ రహదారిపై ప్రధాన కూడళ్ల వద్ద అండర్ బ్రిడ్జిలు, సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేసేంతవరకు పార్టీలకతీతంగా ఉద్యమాలు సాగిస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూరల్ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. జాతీయరహదారిపై బుజబుజనెల్లూరు, కనుపర్తిపాడు, చింతారెడ్డిపాళెం, సౌత్‌రాజుపాళెం క్రాస్ రోడ్ల వద్ద ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, ఈ ఏడాది 52 మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలను కలుపుకొని మూడంచెల పోరాటాన్ని సాగిస్తామని ప్రకటించారు. ప్రజా ఉద్యమం, రాజకీయ ఒత్తిడి, న్యాయపోరాటం చేసి సర్వీస్‌రోడ్లు, అండర్ బ్రిడ్జీలను సాధిస్తామని పేర్కొన్నారు. జాతీయ రహదారి నిర్మాణ సమయంలోనే ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా సర్వీస్‌రోడ్లు, అండర్ బ్రిడ్జిలను నిర్మించాల్సి ఉన్నా, నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. కనుపర్తిపాడు సమీపంలో జాతీయరహదారిపై టోల్‌గేట్ నిర్మాణాన్ని ఉద్యమాలతో నిలిపేశామని, ఇదే పంథాతో ప్రస్తుతం వీటి సాధనకు ఉద్యమిస్తామన్నారు. ఈ నెల ఆరో తేదీన బుజబుజనెల్లూరు క్రాస్‌రోడ్డు వద్ద జాతీయరహదారిపై రాస్తారోకో నిర్వహించి నేషనల్ హైవే అథారిటీ అధికారులకు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఇప్పటికే ఈ అంశంపై బుజబుజనెల్లూరులో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి ఉద్యమానికి కార్యాచరణను రూపొందించామని వెల్లడించారు. ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. పార్టీ నగరాధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, నాయకులు నరసింహయ్యముదిరాజ్, పురుషోత్తమ్‌యాదవ్, మందా పెద్దబాబు, పంట్రంగి అజయ్, పర్వతాల శ్రీనివాసగౌడ్, రియాజ్, బహుదుల్లా, ఖాదర్‌బాషా, సప్తగిరి శీనయ్య, సాయి సునీల్, జయవర్ధన్, మదన్‌కుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.