హైవేలపై వైన్ దుకాణాలకు నో
హైవేలపై వైన్ దుకాణాలకు నో
Published Thu, Jan 19 2017 10:25 PM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM
ఏప్రిల్ నుంచి లైసెన్స్‌లను పునరుద్ధరించం
కలెక్టర్ అరుణ్‌కుమార్ ప్రకటన
28వ రోడ్డు భద్రతా వారోత్సవాలు ప్రారంభం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ) : సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ నుంచి జాతీయ రహదారులపై మద్యం దుకాణాలను అనుమతించేది లేదని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ప్రకటించారు. 28వ రోడ్డు భద్రతా వారోత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో గురువారం ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో జాతీయ రహదారుల వెంబడి ఉన్న వైన్ షాపుల లైసెన్స్ మార్చి నెలాఖరుతో ముగుస్తుందని, ఆ తర్వాత వాటిని పునరుద్ధరించబోమని చెప్పారు. వాహనాల సంఖ్యలోను, ప్రమాదాల్లో కూడా రాష్ట్రంలో జిల్లా మూడో స్థానంలో ఉందన్నారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించామని కలెక్టర్ చెప్పారు. ఇలాంటి ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. జాతీయ రహదారుల మలుపుల వద్ద హెచ్చరిక బోర్డుల ఏర్పాటు, రోడ్డు మరమ్మతులను త్వరలో చేపడతారన్నారు. రోడ్ల భద్రత అనేది పాఠశాలల స్థాయిలో పాఠ్యంశంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. వాహన డ్రైవర్లు అతి వేగానికి నిర్లక్ష్యానికి, మద్యానికి దూరంగా ఉండాలని సూచించారు.
అడిషనల్ ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను జియో ట్యాగింగ్ చేస్తామన్నారు. దీనివల్ల పోలీసు శాఖకు చెందిన ఇంటర్ సెప్టార్ వాహనం సాయంతో ఆ ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించవచ్చన్నారు. అలాగే డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపకుండా నివారణ చర్యలు కూడా చేపట్టినట్టు తెలిపారు.
రూ. 1100 కోట్లతో జాతీయ రహదారి అభివృద్ధి
సమావేశంలో రోడ్డు భవనాల శాఖ ఎస్‌ఈ సీఎస్‌ఎన్ మూర్తి మాట్లాడుతూ జాతీయ రహదారి 216ను జిల్లా పరిధిలో రూ.1100 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అలాగే సామర్లకోట- రాజానగరం ఏడీబీ రోడ్డును రూ.325 కోట్లతో నాలుగు లైన్లుగా విస్తరిస్తామని చెప్పారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే 292 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి, ఈ ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఇన్‌చార్జి డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డీటీసీ) సిరి ఆనంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైద్యఆరోగ్యశాఖ డీసీహెచ్ డాక్టర్ పవన్ కిషోర్, సమాచారశాఖ డీడీ ఎం.ఫ్రాన్సిస్ కూడా ప్రసంగించారు. అనంతరం రోడ్డు భద్రతా వారోత్సవాల పోస్టర్‌ను అధికారులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ కె.చంద్రయ్య, ఎంవీఐలు నరసింహారావు, శివకామేశ్వరరావు, వీజీఎస్ తిలక్, ఆర్.సురేష్, శ్రీనివాస్, ఆయేషా, కల్యాణి, ఎం.రవికుమార్, పరంధామరెడ్డి, రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement