లక్ష్యం లేని జీవితం వ్యర్థం
Published Fri, Aug 26 2016 10:08 PM | Last Updated on Fri, Aug 17 2018 5:52 PM
జగిత్యాల అగ్రికల్చర్: విద్యార్థి దశలోనే లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి. దాని కోసం ఆహోరాత్రులు కష్టపడితేనే జీవితానికి సార్థకత లభిస్తుందని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల మండలంలోని పొలాస వ్యవసాయ పాలిటెక్నిక్‌లో కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు శుక్రవారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ వ్యవసాయ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్ల సలహాలు, సూచలను తీసుకొని ముందుకు వెళ్లాలని కోరారు. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్‌లో ర్యాగింగ్ జరగకుండా ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలతో కమిటీ ఏర్పాటుచేసినట్లు వివరించారు. సీసీ కెమెరాలతో మానిటరింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ర్యాగింగ్ జరిగినట్లు తేలితే సదరు విద్యార్థులను కళాశాల నుంచి బహిష్కరిస్తామని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా నేరుగా తనను కలవాలని సూచించారు. తల్లితండ్రులు సైతం పిల్లలను కళాశాలలో చేర్పించి తమ పని అయిపోయిందని భావిస్తుంటారు. కానీ నెలకోసారి వచ్చి ప్రొఫెసర్లు, వార్డెన్‌లతో సంప్రదింపులు చేయాలని కోరారు. కార్యక్రమంలో స్టూడెంట్ ఆఫైర్ కమిటీ కన్వీనర్ డాక్టర్ కిరణ్‌బాబు, సీనియర్ ప్రొఫెసర్లు నిర్మల, రాజేశ్వరి, పరిపాలనాధికారి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement