అడవుల పెంపకంతో మానవ మనుగడ
కలెక్టర్ ప్రీతిమీనా ∙ట్రెంచింగ్, ప్లాంటేషన్ల పరిశీలన
గూడూరు : అడవుల పెంపకం, రక్షణతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని, పర్యావరణ పరిరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ ప్రీతిమీనా అన్నారు. మండలంలోని అప్పరాజుపల్లి ఫారెస్టు బీట్ పరిధిలోని ప్లాంటేషన్ మొక్కల పెంపకంతోపాటు, అడవిలో ఏర్పాటు చేసిన ఫైర్‌లైన్ , ట్రెంచింగ్ పనులను, హరితహారంలో ఫారెస్టు శాఖ చేపడుతున్న నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని శుక్రవారం కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌ఓ కిష్టగౌడ్ ద్వారా మండల ఫారెస్టు విస్తీర్ణం , చేపట్టిన హరితహారం పనులను, జంతువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అడవుల పెంపకంపై ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రాధాన్యం కల్పిస్తున్నారని, ఫారెస్టు శాఖ అధికారులు విధి నిర్వహణతో అడవుల పెంపకం, రక్షణ చేపట్టాలని సూచించారు. గతంలో మండలంలోని ఫారెస్టు పోడు వల్ల తరిగిపోయిందని, ప్రస్తుతం మ్యాప్ ప్రకారం తరగబడిన అటవీ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకొని, ప్లాంటేషన్లను ఏర్పాటు చేశామని డీఎఫ్‌ఓ కిష్టగౌడ్ కలెక్టర్‌కు తెలిపారు. గతంలో ఇక్కడి ఫారెస్ట్ దట్టంగా ఉండేదని, ఇందులో చిరుతపులులు, వివిధ రకాల జంతువులు ఉండేవని అధికారులు తెలిపా రు. కానీ ప్రస్తుత అడవి తరిగిపోవడంతో పెద్ద జంతువులు కనిపించడంలేదని, జింకలు, దున్నలు, చిన్నచిన్న జంతువులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో మానుకోట ఎఫ్‌ఆర్వో సారయ్య, గూడూరు ఎఫ్‌ఆర్వో బి.రాజయ్య, ఎఫ్‌ఎస్‌ఓ శోభన్, మహేందర్, రాని, ఎఫ్‌బీఓలు పాల్గొన్నారు.