దుస్తులు చింపేసి, జుట్టు కత్తిరించి...!
ప్రొద్దుటూరు : సాటి మహిళ అని చూడకుండా కొందరు అమానుషంగా ప్రవర్తించారు. దుస్తులు చిరిగేలా దాడి చేసి, ఆమె జుట్టును కత్తిరించారు. ఈ సంఘటన వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని సుబ్బిరెడ్డి కొట్టాలలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. ఇంద్రాణి అనే మహిళ సుబ్బిరెడ్డి కొట్టాలలో నివాసం ఉంటోంది. ఆమెకు 10 ఏళ్ల క్రితం వివాహం అయింది. పావని, గణేష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నాలుగేళ్ల క్రితం ఆమె భర్తతో విడిపోయింది. ఆర్ట్స్ కాలేజి రోడ్డులో నివాసం ఉంటున్న గణేష్‌రెడ్డి అనే వ్యక్తి తనకు పెళ్లి కాలేదని చెప్పి మూడేళ్ల క్రితం ఇంద్రాణితో పరిచయం పెంచుకున్నాడు. ఏడాది కిందట ఈ విషయం అతని భార్య శ్రీదేవికి తెలియడంతో పలుమార్లు గొడవ పడింది. అదే సమయంలో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
తనతో మాట్లాడవద్దని, తనకు తరచూ ఫోన్లు చేస్తూ ఇబ్బంది పెట్టవద్దని ఇంద్రాణి ఆ రోజే గణేష్ రెడ్డికి తెగేసి చెప్పింది. అయినా తన భర్త ఇంద్రాణితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని శ్రీదేవి 20 మంది మహిళలను వెంటబెట్టుకుని ఇంద్రాణి ఇంటికి వెళ్లింది. అందరూ కలిసి ఆమె ఇంట్లో విధ్వంసం సృష్టించారు. ఇనుప సుత్తితో ఆమె తలపై కొట్టి గాయపరిచారు. ఆపై ఆమెను కొందరు పట్టుకోగా, మరికొందరు కత్తెరతో జుట్టు కత్తిరించారు. ఆమె వేసుకున్న దుస్తులను చింపేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న బాధితురాలి సోదరుడు ఆమెను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించాడు.
శ్రీదేవితో పాటు మరి కొందరు మహిళలు తనపై దాడి చేశారని ఇంద్రాణి త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బీరువాలో ఉన్న కొంత డబ్బు, 2.5 తులాల బంగారం కనిపించలేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ‘మా ఇంటి వద్దకు రావద్దని అతనికి ఏడాది క్రితమే చెప్పాను. అయినా అతను వినిపించుకోవడం లేదు. వీళ్లు నన్ను చంపేస్తే నా పిల్లలు ఏం కావాలి. పిల్లల కోసమే బతుకుతున్నాను. నా బతుకేదో నన్ను బతకనివ్వండి. ఇంత మంది ఇంటి మీదికి వచ్చి రౌడీల్లా దాడి చేసి చంపేయబోయారు’ అంటూ బాధితురాలు ఇంద్రాణి పోలీసుల వద్ద వాపోయింది.