
నదిలోకి దూకి యువతి ఆత్మహత్యాయత్నం
విజయవాడ : ఆ యువతికి ఏమి కష్టమచ్చిందో ఏమో గానీ ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయచింది. స్థానిక సిబ్బంది అప్రమత్తమై ఆమెను కాపాడారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం మేరకు.. ఒక యువతి ప్రకాశం బ్యారేజీపై అటూఇటూ తిరుగుతూ ఒక్కసారిగా 65వ కానా వద్దకు వచ్చి నదిలోకి దూకింది. అయితే ఆమె బ్యారేజీ గేట్లపై పడింది. ఈ ఘటనను సీసీ కెమెరాలో చూసిన పోలీసు కంట్రోల్ సిబ్బంది వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ అధికారులను అప్రమత్తం చేశారు. కానిస్టేబుల్ ఫణి, హోంగార్డ్ వెంకటేశ్వరరావు అప్రమత్తమై 65వ కానా వద్దకు చేరుకొన్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా ఘటనాస్థలానికి చేరుకున్నారు. పడవలో నదిలోకి వెళ్లి ఆమెను రక్షించి బయటకు తీసుకొచ్చారు. నదిలో దూకిన యువతి నీటిలో కాకుండా ఇనుప గేటుపై పడటంతో కాలికి తీవ్ర గాయమైంది. తన పేరు మాటూరి జయ అని, తండ్రి పేరు కృష్ణారావు అని, తమ ఊరు పాల్వంచ అని చెప్పింది. ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. సీఐ కాశీవిశ్వనాథ్ సిబ్బందిని పర్యవేక్షించారు.