- కూతురుకూ గాయాలు
- బట్టలు అరేస్తుండగా ప్రమాదం
- కేశ్వాపూర్‌లో ఘటన
కరెంట్‌షాక్‌తో మహిళ మృతి
Published Tue, Oct 4 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
హుస్నాబాద్ రూరల్ : మండలంలోని కేశ్వాపూర్‌లో విద్యుదాఘాతంతో మహిళ మృతిచెందింది. ఆమె కూతురు గాయపడింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కలవేని రాజేశం–శ్రీలత దంపతులకు ఇద్దరు కూతుళ్లు అభినయ, అక్షయ ఉన్నారు. రాజేశం ఎనిమిది నెలల క్రితం ఉపాధి కోసం రూ.4 లక్షలు అప్పుచేసి సౌదీ వెళ్లాడు. శ్రీలత కూలీ పనులకు వెళ్లూ పిల్లల బాగోకులు చూసుకుంటోంది. సోమవారం మధ్యాహ్నం బట్టలు ఉతికి ఆరేసేందుకు దండె వద్దకు వెళ్లింది. అక్షయ కూడా తల్లి వెంటే ఉంది. ఇంటి ఇనుప దూలానికి కట్టిన దండెంకు విద్యుత్ సరఫరా కావడంతో ఉతికిన బట్టలు ఆరేస్తుండగా శ్రీలత విద్యుత్‌షాక్‌కు గురైంది. గట్టిగా అరవడంతో ఇరుగుపొరుగువారు అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో తీగ తెగి పక్కనే ఉన్న కూతురుపై పడింది. దీంతో స్థానికులు తీగను కర్రతో కొట్టడంతో అక్షయ గాయాలతో బయటపడింది. శ్రీలత మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ఏఎస్సై మోతిరాం సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు.
సౌదీలో కల్లివెల్లి అయిన రాజేశం
సౌదీ కంపెనీలో పనులు లేక రాజేశం అక్కడ కల్లివెల్లి అయ్యాడు. స్వదేశం తిరిగి రావడానికి చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో అక్కడే ఉండిపోయాడు. నాలుగు నెలలుగా భర్త నుంచి సమాచారం లేక పోవడంతో భార్యా బిడ్డలు అందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఈ దుర్ఘటన జరగడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. తండ్రి సౌదీలో ఉండగా, తల్లి మృతిచెందడంతో కూతుళ్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం స్పందించి పేద కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ గందపు రమేశ్, ఎంపీటీసీ సభ్యురాలు కొమిరె స్వరూప కోరారు.
Advertisement
Advertisement