భార్య కావలెను
మొన్న సుబ్బారావు కనిపించాడు. నమస్తే చెల్లెమ్మా... అని ఉత్సాహంగా పలకరించాడు. ఏమిటి సంగతి అనంటే డివోర్స్ అయిపోయిందట మంచి అమ్మాయి ఉంటే చూడమ్మా చేసుకుంటాను అన్నాడు. మళ్లీ మనవాడికి మంచి భార్య కావాలన్నమాట. నేను కూడా ఒకరికి భార్యనే. ఇద్దరు పిల్లల తల్లినే. కానీ ఈ సుబ్బారావు శాల్తీ తగిలినప్పటి నుంచి నా బుర్రలో కూడా ఒక పురుగు తొలుస్తూ ఉంది. నాక్కూడా ఒక భార్య ఉంటే ఎంత బాగుంటుంది? అవును. మీరు సరిగ్గానే విన్నారు. నాక్కూడా ఒక భార్య ఉంటే ఎంత బాగుంటుంది. ఎందుకు అంటారా? చెప్తా వినండి. నాకు భార్య కావాలి. నేను మళ్లీ ఏ ఉస్మానియా లోనో, సెంట్రల్ యూనివర్సిటీ లోనో చేరి నా చదువును తిరగదోడి సరిగా చదివి ఆ చదువుతో నాలుగు డబ్బులు సంపాదించే యోగ్యతను తెచ్చుకుని నా కాళ్ల మీద నేను నిలబడదలుచుకున్నాను కనుక నాకో భార్య కావాలి.
నేను తెల్లారి పుస్తకాలు పట్టుకుని చదువుకు పోతే నా పిల్లలను ‘నాన్నా.. కన్నా’ అని లేపి, ముద్దు చేసి, బాత్రూమ్లో ఫలానాది కడిగి, బ్రష్ చేయించి, స్నానానికి శుభ్రంగా వొళ్లు రుద్ది, బ్రెడ్ తినిపించి, స్కూల్ బ్యాగులు ఈ భుజాన ఒకటి ఆ భుజాన ఒకటి తగిలించుకుని మెట్లు దిగి బస్ దాకా నడిచి పిల్లలను ఎక్కించి వచ్చే భార్య కావాలి. వాళ్లు అమ్మా జ్వరం అంటే హాస్పిటల్‌కి ఫోను కొట్టి ఫలానా డాక్టర్ అపాయింట్ ఉందేమో చెప్తారా అండీ అని వినమ్రంగా అడిగే భార్య కావాలి. స్స్... పంటి నొప్పి అనగానే ఊబర్ బుక్ చేసి అమీర్‌పేట దాకా వెళ్లి మంచి డెంటల్ హాస్పిటల్లో చూపించుకుని వచ్చే భార్య కావాలి. ‘అమ్మా... నా ఫ్రెండు ప్రహ్లాద్గాడు వాళ్ల నాన్నతో కలిసి ఈ సమ్మర్‌కు సింగపూర్ వెళుతున్నాడట’ అని చిన్నబుచ్చుకుంటే ‘వెళితే వెళ్లనీయమ్మా... మనం ఎంచక్కా మీ నానమ్మ ఊరు జగ్గయ్యపేట వెళదాం’ అని వాళ్లలో సంతోషమూ ఆత్మవిశ్వాసమూ నింపి వాళ్లను తల ఎత్తుకు తిరిగేలా చేసే భార్య కావాలి.
నేను వెళుతూ వెళుతూ ఒక క్షణం గడప దగ్గర నిలబడి ఏదైనా సాయం కావాలా అని మాటవరసకు అడిగితే ‘ఇవన్నీ ఉండే తలనొప్పులేలేండి. మీకెందుకు మీరెళ్లండి’ అని చిరునవ్వు చెదరకుండా చెప్పే భార్య కావాలి. అయితే ఆమె కాస్తో కూస్తో పని చేయాలండోయ్. ఆఫీసుకు ఇలా వెళ్లి అలా వచ్చేయాలి. లేట్ అవర్స్ గీట్ అవర్స్ జాన్తా నై. కావాలంటే ఒక గంట పని తగ్గించుకుని నా కోసం నా పిల్లల కోసం టైమ్ స్పెండ్ చేయాలి. అలాంటి భార్యే కదా నాకు కావాలి. ఇక నాక్కావలసిన భార్య నుంచి నేను కాసింత మంచి వంటను ఆశించడం తప్పంటారా? రొయ్యలు, వంకాయ కలిపి రుచిగా తియ్యగూర చేసే భార్యను, మిరియాల చారు కాచినప్పుడు తప్పకుండా గుర్తు పెట్టుకుని వడియాలు కాల్చి ఇచ్చే భార్యను, ఈ మనిషికి లేత సొరకాయ కూరంటే మహా ఇష్టం సుమండీ అని తెచ్చి కాసింత పాలుబోసి వండి పెట్టే భార్యను కోరుకోవడం ఏ మాత్రం అత్యాశ కాదంటే కాదు.
నాకు కష్టం కలక్కుండా పిల్లలకు అంతరాయం కలక్కుండా విసుక్కోకుండా జిడ్డోడే ముఖంతో కనిపించకుండా ఇప్పుడే స్నానం చేసి రెడీ అయినట్టుగా వంట చేసుకుంటూ కనిపించే భార్య కావలెను. ఇక డీమార్ట్‌కు రా, మోర్‌కు రా, మెట్రోకు రా అని ఆమె పిలిచేది లేదు. నేను వెళ్లేదీ లేదు. ఇంటికి ఏయే సరుకులు కావాలో ఆమెకు తెలియదా? మధ్య నేను పుల్ల పెట్టాలా? కాని– ఇవన్నీ తను చేసుకుంటూ తన లోకంలో ఉంటే కాదనను కాని నాకింత నడుము పట్టేసినప్పుడు, మెడ పీకేస్తున్నప్పుడు, పడిశంతో ముక్కు ఎర్రగా అయిపోయినప్పుడు ‘అయ్యో... ఏమిటండీ ఇలాగా’ అంటూ ఆగమాగం అయిపోయి నాకోసం లీవు పారేసి నా నొప్పి తన నొప్పిగా భావించి కూచునే భార్య నాకు తప్పనిసరిగా కావాలి.
ఇంటి శుభ్రత పట్ల తనకు పట్టింపు ఉండాలి. ఈ ఇంటిని ఎప్పుడూ నేను శుభ్రంగా ఉంచుకుంటాను దీనికి ఎవ్వరి సహాయం అక్కర్లేదు అనే ఆత్మాభిమానం నాక్కాబోయే భార్యకు ఉండాలి. ఇక సంవత్సరానికి ఒకసారి అరకో, హార్సిలీహిల్సో వెళతాము కదా. అప్పుడు ‘ఏయ్ పిల్లలూ... డిస్ట్రబ్ చేయకండి’ అని వాళ్లను బంతాటకు దూరం తీసుకెళ్లి నన్ను మాత్రం చెట్టు కింద రిలాక్స్డ్గా పడుకుని కొబ్బరి నీళ్లు తాగేలా చేసే మంచి భార్య నాకు కావాలి.ఇక సంఘంలో నా మర్యాద నిలబెట్టే భార్య ఉండాలని ఎవరు మాత్రం అనుకోరు చెప్పండి.
గెస్టులు వస్తారనగా టపాటపా ఇల్లు సర్దేసి, సోఫా కవర్లు మార్చేసి, ఫ్లవర్ వాజుల్లో కొత్త పూలు పెట్టేసి, రూమ్ స్ప్రేలు కొట్టేసి, పిల్లలూ బుద్ధిగా ఉండాలమ్మా అని వాళ్లకు జాగ్రత్తలు చెప్పేసి, ఎవరెవరికి ఏ పదార్థం ఇష్టమో వండి పెట్టేసి, డ్రింక్స్లోకి ఈ స్నాక్స్ కావాలా ఆ స్నాక్స్ కావాలా అని కర్టెన్ పట్టుకు నిలబడి అడిగేసి, యాష్ ట్రేలను తళతళలాడేట్టు టీపాయ్ మీద పెట్టేసి, గెస్ట్‌లు వచ్చాక ప్రతి మాట అనుమతి కోసం నా వైపు చూస్తూ నా మెచ్చుకోలును పొందే భార్య నాకు కావాలి. ఇదొకటా. ఒక్కోసారి ‘నాకు బోర్ కొడుతుందోయ్ ఫ్రెండ్స్‌తో పోతున్నా రాత్రికి రాను’ అనంటే ‘అదెంత మాట అలాగే’ అనే భార్య నాకు కావాలి.
ఇక రాత్రి పూట ‘ఊహూ’ ‘నోనో’ అనే భార్య నాకు నచ్చదు. పిలిచినప్పుడు రావాలి. చెప్పినట్టు వినాలి. నేను టీవీ చూసీ చూసీ సెల్లో గడిపీ గడిపీ తను గాఢనిద్రలో ఉండగా లేపి రమ్మన్నా నిద్ర కళ్లతో అయినా సరే రావాలి. కాని నాకు మూడ్ లేనప్పుడు పిలవకూడదు. తనకు కావాలను కున్నప్పుడు పిలవకూడదు. అలా చేస్తే నాకు చాలా చెడ్డ కోపం వస్తుందని గ్రహించి మసలుకునే భార్య నాకు కావాలి.సరే. నాకు చదువు అయిపోయింది. ఉద్యోగం వచ్చేసింది. డబ్బులొస్తున్నాయ్. ఇక నోర్మూసుకుని ఇంట్లో కూచో... నన్నూ పిల్లలను చూసుకో అనంటే అలాగేనండీ అని పల్లెత్తు మాట అనని భార్య కావాలి. సరేనబ్బా. ఇది కూడా చెప్పేస్తా.
ఇన్‌కేస్ నాకు ఈ భార్య కంటే ఇంకో మంచి భార్య కాదగ్గ అమ్మాయి కనిపించిందనుకోండి.. ఈమెను వదిలిపెట్టి ఆమెతో కొత్త జీవితం ప్రారంభించా లనుకున్నాననుకోండి... అప్పుడు ఎల్లెల్లవో అని ఇంటి నుంచి పంపేస్తే డివోర్స్ ఇచ్చేస్తే నా కొత్త జీవితం కోసం పిల్లలను తీసుకుని కిక్కురు మనకుండా నిష్క్రమించే ఉత్తమురాలైన భార్య నాకు కావాలి.భార్య వల్ల ఇన్ని సౌలభ్యాలు ఉండగా భార్యను మీరు వద్దంటారా? నేను వద్దంటానా? చెప్పండి. కథ ముగిసింది.
అమెరికన్ స్త్రీ హక్కుల కార్యకర్త జూడీ బ్రాడీ రాసిన వ్యంగ్య రచన ఇది. 1971లో చేసిన ఈ రచన అప్పటి నుంచి కొన్ని వందలసార్లు పత్రికలలో ప్రచురితం అవుతూనే ఉంది. నేటికీ ప్రాసంగికత కలిగి ఉంది. ‘ఇంటికి వెళ్లి ఏ సంగతీ ఉత్తరం రాస్తాం’ అనే మాటకు మించిన హింసాత్మకమైన మాట ఉందా? ఎస్ చెప్పాల్సింది మగపెళ్లివాళ్లు. ఎగిరి గంతెయ్యాల్సింది ఆడపెళ్లివాళ్లు. షరతులు చెప్పాల్సింది అబ్బాయి. ఓకే చెప్పాల్సింది అమ్మాయి. పెళ్లయ్యాక వేధించాల్సింది అబ్బాయి వేదన పడాల్సింది అమ్మాయి. ద్వంద్వ ప్రమాణాలు పేరుకుపోయిన వ్యవస్థ పెళ్లి. అందులో ఏ శ్రమ చట్టం లేని కార్మికురాలు భార్య. ఈ అసంఘటిత వర్గం ఏకమైతే యజమాని పరిస్థితి ఏమిటో.