keswapoor
-
కరెంట్‌షాక్‌తో మహిళ మృతి
కూతురుకూ గాయాలు బట్టలు అరేస్తుండగా ప్రమాదం కేశ్వాపూర్లో ఘటన హుస్నాబాద్ రూరల్ : మండలంలోని కేశ్వాపూర్లో విద్యుదాఘాతంతో మహిళ మృతిచెందింది. ఆమె కూతురు గాయపడింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కలవేని రాజేశం–శ్రీలత దంపతులకు ఇద్దరు కూతుళ్లు అభినయ, అక్షయ ఉన్నారు. రాజేశం ఎనిమిది నెలల క్రితం ఉపాధి కోసం రూ.4 లక్షలు అప్పుచేసి సౌదీ వెళ్లాడు. శ్రీలత కూలీ పనులకు వెళ్లూ పిల్లల బాగోకులు చూసుకుంటోంది. సోమవారం మధ్యాహ్నం బట్టలు ఉతికి ఆరేసేందుకు దండె వద్దకు వెళ్లింది. అక్షయ కూడా తల్లి వెంటే ఉంది. ఇంటి ఇనుప దూలానికి కట్టిన దండెంకు విద్యుత్ సరఫరా కావడంతో ఉతికిన బట్టలు ఆరేస్తుండగా శ్రీలత విద్యుత్‌షాక్‌కు గురైంది. గట్టిగా అరవడంతో ఇరుగుపొరుగువారు అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో తీగ తెగి పక్కనే ఉన్న కూతురుపై పడింది. దీంతో స్థానికులు తీగను కర్రతో కొట్టడంతో అక్షయ గాయాలతో బయటపడింది. శ్రీలత మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ఏఎస్సై మోతిరాం సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. సౌదీలో కల్లివెల్లి అయిన రాజేశం సౌదీ కంపెనీలో పనులు లేక రాజేశం అక్కడ కల్లివెల్లి అయ్యాడు. స్వదేశం తిరిగి రావడానికి చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో అక్కడే ఉండిపోయాడు. నాలుగు నెలలుగా భర్త నుంచి సమాచారం లేక పోవడంతో భార్యా బిడ్డలు అందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఈ దుర్ఘటన జరగడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. తండ్రి సౌదీలో ఉండగా, తల్లి మృతిచెందడంతో కూతుళ్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం స్పందించి పేద కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ గందపు రమేశ్, ఎంపీటీసీ సభ్యురాలు కొమిరె స్వరూప కోరారు. -
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
హుస్నాబాద్‌రూరల్ : కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం కేశ్వాపూర్ గ్రామానికి చెందిన బొమ్మగాని సంపత్(45) అనే రైతు శనివారం వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంపత్ తన ఆరెకరాల భూమిలో వ్యవసాయంతోపాటు గీతవత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. రూ.రెండు లక్షల అప్పులు చేసి రెండు బోర్లు వేయగా చుక్క నీరు రాలేదు. గత మూడు నెలల కిందట పెద్ద కూతురు వివాహనికి మరో రూ.ఆరు లక్షల వరకు అప్పులు చేశాడు. పంటల దిగుబడులు వస్తే అప్పులు తీర్చవచ్చని భావించాడు. కానీ ఖరీఫ్‌లో వేసిన పత్తి, మొక్కజొన్న పంటల్లో ఆశించిన దిగుబడులు వచ్చేలా లేకపోవడంతో మనస్తాపం చెందాడు. తన వ్యవసాయ బావి వద్దనే చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సంపత్‌కు భార్య రేణుక, కూతురు, కొడుకు ఉన్నారు. -
కబ్జాకోరల్లో సర్కార్ భూమి
కేశ్వాపూర్లో రూ.2కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతం పట్టించుకోని రెవెన్యూ అధికారులు హుస్నాబాద్‌రూరల్ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. కోట్ల విలువైన సర్కార్ భూములు అన్యాక్రాంతమవుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. ఏం చేయాలో తెలియక ప్రజాప్రతినిధులు తలపట్టుకుంటున్నారు. కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకుని పేదదళితులకు పంపిణీ చేయాలని పలువురు కోరుతున్నారు. హుస్నాబాద్ మండలం కేశ్వాపూర్ గ్రామ పరిధిలోని జీడి గట్టు సమీపంలోని సర్వే నంబర్ 154లో 52ఎకరాల సాగుకు అనువైన ప్రభుత్వ భూమి ఉంది. దీనిలో 2.20 ఎకరాలను గౌడ సంఘానికి ప్రభుత్వం కేటాయించగా.. మిగిలిన భూమిలో గ్రామస్తులు గొర్లు, పశువులకు మేతకోసం వినియోగించుకునేవారు. ఇటీవల భూమి తమదేనంటూ 30 ఎకరాల భూమిని కొందరు ఆక్రమించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇటీవల గ్రామ సందర్శనకు వచ్చిన తహసీల్దార్ టి.వాణికి ఫిర్యాదు చేశారు. 10ఎకరాలను గౌడ సంఘం, మరో 10 ఎకరాలను సరిహద్దులోని రైతుల, ధర్మారం శివారులో 10 ఎకరాలు ఆక్రమించుకుని సాగు చేస్తున్నారని వివరించారు. ఇక్కడ ఎకరాకు రూ.4 లక్షలవరకు ధర పలుకుతుంది. ఈ లెక్కన దాదాపు రూ.2కోట్ల భూమి కబ్జాకు గురైంది. ప్రభుత్వ భూమిని సర్వే చేసి హద్దులు పెట్టాలని గ్రామస్తులు కోరారు. పేదల దరిచేరని భూపంపిణీ పథకం ఎస్సీ, ఎస్టీల కుటుంబాల అభివద్ధి కోసం భూపంపిణీ పథకం ప్రారంభించి రెండేళ్లు పూర్తయినా హుస్నాబాద్ మండలంలో ఒకరికీ భూపంపిణీ జరగలేదు. కేశ్వాపూర్లో భూమిలేని ఎస్సీ కుటుంబాలు 20 వరకు ఉన్నాయి. ప్రభుత్వం లక్షలు ఖర్చు పెట్టి భూమికొనుగోలు చేసే బదులు గ్రామంలో ఉన్న 60 ఎకరాలను స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని పలువురు కోరుతున్నారు. భూఅభివద్ధి పథకం కింద బావుల తవ్వకానికి రుణాలు మంజూరు చేస్తే ఆ కుటుంబాలు బతుకుతాయని ప్రజాప్రతినిధులు అంటున్నారు. కలెక్టర్ స్పందించి కబ్జా భూములను స్వాధీనం చేసుకుని భూపంపిణీ చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ భూమికి హద్దులు పెట్టాలి సర్వే నంబర్ 154లో 50 ఎకరాల భూమి కబ్జాకు గురవుతోంది. దీనిపై పలుమార్లు రెవెన్యూ అధికారులకు చెప్పినం. సర్వే చేసుడు లేదు.. భూమి ఇచ్చుడు లేదు. ఇప్పటికైనా ప్రభుత్వ భూమిని సర్వే చేసి పంచాయతీకి అప్పగిస్తే హరితహారం కింద మొక్కలు పెంచుతాం. –గంధపు రమేశ్,సర్పంచ్ సర్వే చేసి హద్దులు వేస్తాం కేశ్వాపూర్లోని సర్వే నంబర్ 154లో 52 ఎకరాల భూమిలో 2.20ఎకరాల భూమిని గౌడ సంఘానికి ప్రభుత్వం ఇచ్చింది. ఇక ఎవరికి ఎలాంటి భూపట్టాలు ఇవ్వలేదు. కబ్జా చేస్తున్న విషయాన్ని గ్రామస్తులు నా దష్టికి తెచ్చారు. దీనిపై సర్వే చేసి కబ్జా చేసిన భూమి స్వాధీనం చేసుకుంటాం.