
అడవిలో మహిళను చెట్టుకు కట్టేసి...
సుండుపల్లి: గుర్తు తెలియని వ్యక్తులు ఓ మహిళను అడవిలో నిర్బంధించిన ఘటన వైఎస్సార్ జిల్లాలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. సుండుపల్లి మండల కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో 60 ఏళ్ల ఓ మహిళను తాళ్లతో చెట్టుకు కట్టేశారు.
ఆదివారం మధ్యాహ్నం కొందరు మహిళలు కట్టెల కోసం అడవికి వెళ్లగా చెట్టుకు కట్టేసున్న మహిళను గుర్తించారు. ఆమెకు కట్లు విప్పి సమీపంలోని కమ్మగుట్టపల్లి గ్రామానికి తీసుకెళ్లారు. పూర్తిగా నీరసించిపోయిన స్థితిలో ఉన్నఆమె తన పేరు ఫాతిమా అని చెబుతోంది. ఆమెను అడవిలో ఎవరూ కట్టేశారన్న విషయం తెలియరాలేదు. కిడ్నాప్ చేసి తీసుకువచ్చి అడవిలో కట్టేసినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. ఊరు, మిగతా వివరాలు సరిగ్గా చెప్పలేకపోతుంది. అదే సమయంలో అటువైపు వస్తున్న ఐపీఎస్ అధికారి అమిత్ బర్గర్ చొరవ తీసుకుని ఆమెను సుండుపల్లి ప్రభుత్వాస్పుత్రికి తరలించారు. అక్కడ నుంచి రాయచోటి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.