సర్వజనాస్పత్రిలో బాలింత మృతి
వారంలో మూడుసార్లు సర్జరీ
పేగుకు రంధ్రం.. నొప్పి తీవ్రం
కోలుకోలేక ప్రాణం వదిలిన వైనం
వైద్యుల నిర్లక్ష్యమేనంటూ బంధువుల ఆగ్రహం
సర్వజనాస్పత్రిలో ఓ బాలింత మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే సరైన వైద్యం అందక మృతి చెందిందంటూ బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. వైద్యాధికారులు, పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.
- అనంతపురం న్యూ సిటీ
అనంతపురం సర్వజనాస్పత్రిలో మంగళవారం బాలింత మృతి చెందడంతో ఉద్రిక్తత నెలకొంది. పామిడి మండలం వంకరాజుకాలువకు చెందిన స్వప్న (23), రామాంజనేయులు దంపతులు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. స్వప్న రెండోసారి గర్భం దాల్చడంతో కాన్పు కోసం ఆమె భర్త ఈ నెల 16న అనంతపురం సర్వజనాస్పత్రిలో చేర్చాడు. అదే రోజున డాక్టర్ విజయలక్ష్మి ఆమెకు సిజేరియన్ చేశారు. స్వప్న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సిజేరియన్ అయిన రోజు నుంచి స్వప్న కడుపు ఉబ్బరంగా ఉండడంతో పాటు నొప్పి ఎక్కువగా ఉందని కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు గైనిక్ వైద్యులు, సిబ్బంది దృష్టికి తీసుకెళితే నొప్పి మామూలేనంటూ తేలిగ్గా తీసుకున్నారు. రోజురోజుకూ నొప్పి తీవ్రం కావడంతో గైనిక్ వైద్యులు మరోసారి ఆపరేషన్ చేసి పరిశీలించగా.. పేగుకు రంధ్రం ఉన్నట్లు గుర్తించారు. పరిస్థితి విషమంగా మారుతుండటంతో ఈ నెల 19న ఏఎంసీకు మార్చారు.
గైనిక్, సర్జరీ వైద్యులు, అనస్తీషియన్లు మరోసారి పరీక్షించి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్‌తో సర్జరీ చేయించాలని నిర్ణయించారు. ఈ నెల 25న కర్నూలు నుంచి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ ఆర్.సి.రామంచంద్రనాయుడుతో సర్జరీ చేయించారు. అయినా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో స్వప్న మృతి చెందింది. భర్తకు విషయం తెలియగానే సొమ్మసిల్లి పడిపోయాడు. కుటుంబ సభ్యులు, బంధువులు రోదించారు. రోజుల పసికందు, మూడేళ్ల బాబు బాగోగులను వికలాంగుడైన తండ్రి రామాంజనేయులు ఎలా చేసుకుంటారంటూ విలపించారు.
వైద్యులపై చర్యలు తీసుకోండి
బాలింత మృతికి కారకులైన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. సిజేరియన్ సమయంలోనే పేగుకు రంధ్రం పడిన విషయం గుర్తించి, అవసరమైన చికిత్స చేసి ఉంటే బతికి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసే వరకూ కదిలేది లేదని, మృతదేహంతో ధర్నా చేపడతామని అనడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జగన్నాథ్, సర్జరీ విభాగం హెచ్‌ఓడీ రామస్వామినాయక్, అనస్తీషియన్ డాక్టర్ నవీన్, గైనిక్ డాక్టర్ సంధ్య, టూటౌన్ సీఐ యల్లంరాజు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. విచారణ జరిపి న్యాయం చేస్తామని చెప్పడంతో వారు శాంతించారు.
మా ప్రయత్నం మేం చేశాం
స్వప్నకు సర్జరీ చేసిన వైద్యురాలు డాక్టర్ విజయలక్ష్మి శస్త్రచికిత్సల్లో అనుభవం కల్గినవారు. సర్జరీ చేసిన వైద్యులు, స్టాఫ్‌ను విచారించాం. అన్ని జాగ్రత్తలూ తీసుకునే సర్జరీ చేశామని చెబుతున్నారు. పేగులో ఏ విధంగా రంధ్రం పడిందో అర్థం కాని పరిస్థితి. బాలింత ప్రాణం కాపాడేందుకు మా ప్రయత్నం మేం చేశాం. డాక్టర్ల తప్పిదమేమీ లేదు.
– డాక్టర్ జగన్నాథ్, ఆస్పత్రి సూపరింటెండెంట్