అక్రమ విద్యుత్ కనెక్షన్ వైరు తగిలి మృతి చెందిన నర్సమ్మ
-
పది నెలల క్రితమే తండ్రి మృతి
-
అనాథలైన ఇద్దరు చిన్నారులు
న్యూలక్ష్మిపురం (ముదిగొండ) : ఇల్లు శుభ్రం చేసి, ఇంటి వెనుక ఊడ్చేందుకు వెళ్లిన మహిళలకు అక్రమ విద్యుత్ కనెక్షన్‌తో సరఫరా అయి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన మండలంలోని న్యూలక్ష్మిపురంలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... న్యూ లక్ష్మిపురం గ్రామానికి చెందిన తమ్మ నర్సమ్మ (35) కూలీ పనులు చేసుకుంటూ తన ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తుంది. ఆదివారం ఇళ్లు ఊడ్చి చెత్తా చెదారం తొలగించి వెనుక ఉన్న ఆవరణను ఊడ్చడానికి వెళ్లిన నర్సమ్మకు ఇంటి వెనకాలే ఉన్న పెన్సింగ్‌కు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అయితే ఓ వ్యక్తికి చెందిన గోశాల నిర్మాణంకు అక్రమంగా ప్రభుత్వ అనుమతి లేకుండా విద్యుత్ కనెన్షన్ ఇచ్చారు. ఎటువంటి నిబంధనలు పాటించకుండా కనెన్షన్ ఇవ్వడంతో ఆ పెన్సింగ్‌కు విద్యుత్ వైర్లు తగడంతో కరెంట్ సరఫరా అయింది. దీంతో ప్రమాదం చోటు చేసుకుంది. మృతురాలి తండ్రి నాగయ్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ తాటిపాముల కరుణాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
అనాథలైన పిల్లలు..
పది నెలల క్రితం తండ్రి నర్సింహారావు మృతి చెందగా ఇప్పుడు తల్లి కూడా విద్యుత్‌షాక్‌తో మృతి చెందడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను చూసి గ్రామస్తులంతా కంటతడి పెట్టారు.