వధువు+వధువు=దంపతులు! | woman married to girl in vizag | Sakshi
Sakshi News home page

వధువు+వధువు=దంపతులు!

Published Tue, Jul 19 2016 5:44 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

వధువు+వధువు=దంపతులు!

వధువు+వధువు=దంపతులు!

బాలికను పెళ్లి చేసుకున్న యువతి
కలకలం రేపిన విచిత్ర వివాహం
కౌన్సెలింగ్ ఇచ్చి బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
 
విశాఖపట్నం: పాతికేళ్ల యువతి ఓ బాలికను వివాహం చేసుకున్న ఘటన విశాఖ నగరంలోని గాజువాకలో కలకలం రేపింది. తామిద్దరం కలిసి జీవించాలనుకునే వివాహం చేసుకున్నామని వారు చెబుతున్నారు. పోలీసుల కథనం మేరకు.. విశాఖ నగర పరిధిలోని పెదగంట్యాడ దిబ్బపాలెం కాలనీకి చెందిన కుక్కిరి యలమాజి అలియాస్ తేజ(25) డిగ్రీ వరకు చదివింది. ఆమె నడవడిక బాగోకపోవడంతో మూడు నెలల క్రితం తల్లిదండ్రులు ఇంటి నుంచి గెంటివేశారు. దీంతో ఆమె అదే కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటోంది.
 
 గత ఏడాది పదో తరగతి పాసై ప్రస్తుతం గాజువాకలోని ఓ ఫుట్‌పాత్ దుస్తుల షాపులో పని చేస్తున్న యాతపాలేనికి చెందిన బాలిక (16)తో రెండు వారాల క్రితం తేజకు పరిచయమైంది. ఐదు రోజుల వ్యవధిలోనే వారి పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుని.. కలిసి జీవించాలని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. తల్లిదండ్రులకు చెప్పకుండా పది రోజుల క్రితం తిరుపతికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. తేజ వరుడి అవతారమెత్తి బాలిక మెడలో తాళి కట్టింది. ఇదిలా ఉండగా తమ కుమార్తె కనిపించకపోవడంతో ఆందోళన చెందిన బాలిక తల్లిదండ్రులు ఆమె ఆచూకీ కోసం చాలా ప్రయత్నాలు చేశారు.
 
 ఆ క్రమంలో తేజ మొబైల్ నెంబర్‌కు ఫోన్ చేయగా.. తాము వివాహం చేసుకున్నామని చెప్పారు. ఇంటికి రమ్మని కోరితే నిరాకరించారు. దీంతో బాలిక సోదరుడు మరోమారు ఫోన్ చేసి ‘అమ్మానాన్న బెంగతో ఏడుస్తూ కూర్చున్నారు. పనులకు కూడా వెళ్లడం లేదు.. డబ్బుల్లేక తినడానికి కూడా ఇబ్బందిగా ఉంద’ని చెప్పాడు. దానికి స్పందించిన ఆ బాలిక ‘గాజువాక బీసీ రోడ్డులోని నీటి ఏనుగు బొమ్మ వద్దకు వస్తే డబ్బులిస్తానని’ చెప్పింది.
 
 ఆ మేరకు సోదరుడు శనివారం అక్కడికి వెళ్లాడు. అతని వెనుకే మరికొందరు వెళ్లారు. తేజతో కలిసి వచ్చిన బాలిక వెయ్యి రూపాయలు ఇస్తుండగా స్థానికుల సహకారంతో వారిని పట్టుకుని గాజువాక పోలీసులకు అప్పగించారు. గాజువాక సీఐ ఇమ్మానుయేల్ రాజు, ఎస్‌ఐ అప్పలరాజు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం తేజను అదుపులోకి తీసుకుని, బాలికను తల్లిదండ్రులతో ఇంటికి పంపించారు.

Advertisement

పోల్

Advertisement