అత్తింటి వేధింపులు తాళలేక
గుంతకల్లు : పెళ్లై ఏడు నెలలు గడువక ముందే ఆమెకు అత్తింటి ఆరళ్లు మొదలయ్యాయి. అదనపు కట్నం తేవాలని భర్త, అత్తమామలు వేధించడంతో ఆమె ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గుంతకల్లు టూటౌన్ పోలీసులు, బాధిత మహిళ తల్లి ఖాతీజాబీ, అన్న షేక్షావలి తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.
రాయలచెరువుకు చెందిన ఖాతీజాబీ కుమార్తె రిజ్వానాను ఏడు నెలల క్రితం గుంతకల్లు కోళ్లఫారానికి చెందిన షేక్షావలి, మాబూన్నీల దంపతుల కుమారుడు ఖాయ్యూంకు ఇచ్చి వివాహం చేశారు. వివాహ సమయంలో ఖాయ్యూం కుటుంబ సభ్యులు కోరిన మేరకు రూ.2.70 లక్షలు, 12 తులాల బంగారం కట్న కానుకలు ఇచ్చారు. ఖాయ్యూం దుస్తుల వ్యాపారి. రెండు మాసాలపాటు వీరి సంసారం సాఫీగా సాగింది. అనంతరం అదనపు కట్నం తేవాలంటూ భర్త, అత్తమామలు రిజ్వానాను తరచూ వేధించేవారు.
ఈ క్రమంలో చాలాసార్లు ఆమెపై వీరు దాడిచేశారు. ఏమీ చేయలేని రిజ్వానా విషయాన్ని తల్లి, అన్నతో ఫోన్‌లో చెప్పుకుని బాధపడుతుండేది. వారి వేధింపులు అధికం కావడంతో మంగళవారం సాయంత్రం ఇంట్లో తన బెడ్‌రూంలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు ఎంతపిలిచినా సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలుకొట్టారు. అప్పటికే ఆమె ఫ్యానుకు వేలాడుతూ కన్పించింది. విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ ప్రసాద్‌రావు, టూటౌన్ ఎస్‌ఐ వలీబాషా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రిజ్వానా బంధువులు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు.
భర్త వేధింపులు తాళలేక..
అనంతపురం సెంట్రల్ : ఉన్నత చదువు..గౌరవప్రదమైన ప్రభుత్వ ఉద్యోగం అతడిది. భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. అయినా మగ పిల్లాడు కావాలంటూ నిత్యం భార్యను వేధించేవాడు. భర్త వేధింపులు భరించలేక ఆ ఇల్లాలు బలవన్మరణానికి పాల్పడి తనువు చాలించింది. నగరంలో నాల్గవరోడ్డులో మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి. ట్రాన్స్‌కో డిపార్ట్‌మెంట్‌లో ఏఈగా పని చేస్తున్న హనుమంతు నగరంలో నాల్గవరోడ్డులో నివాసముంటున్నాడు.
హనుమంతుకు ఎనిమిదేళ్ల క్రితం బొజ్జమ్మ(30)వివాహమైంది. వీరికి దివ్య(4), లక్ష్మి(2) సంతానం. అయితే మగపిల్లాడు జన్మించలేదనే కారణంతో నిత్యం హనుమంతు భార్యతో గొడవపడేవాడు. ఈ కారణంగా వారి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. వేధింపులు అధికం కావడంతో మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బొజ్జమ్మ చీరతో ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు త్రీటౌన్ సీఐ వెంకటేశులు తెలిపారు.