వివాహిత ఆత్మ‘హత్య’
- ఉసురు తీసిన అదనపు కట్నం వేధింపులు
- పెళ్లైన మూడేళ్లకే ముగిసిన జీవితం
ఓ వివాహిత అనుమానాస్పదస్థితిలో మరణించింది. ఆత్మహత్య చేసుకుందని మెట్టినింటి వారు అంటుండగా, హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని పుట్టింటి వారు ఆరోపించారు. ఏదేమైనా కట్నం వేధింపులు ఓ నిండు ప్రాణాన్ని మాత్రం బలిగొన్నాయి.
- తాడిపత్రి రూరల్
తాడిపత్రి గన్నెవారిపల్లె కాలనీలో రాజు భార్య అనూరాధ(25) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పెళ్లై పట్టుమని మూడేళ్లు కూడా కాలేదని, అప్పుడే భర్త సహా అత్తమామలు కలసి అదనపు కట్నం కోసం వేధించడంతో మనస్తాపం చెందిన ఆమె ఉరేసుకుని ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు...
అప్పు తీర్చడం కోసం అదనపు కట్న వేధింపులు
రాజు, అతని తండ్రి వెంకటేసులు కలసి ఇటుకల తయారీ ఫ్యాక్టరీ పెట్టారు. అందుకు రూ.10 లక్షల అప్పు చేశారు. ఆ అప్పును రాజు తండ్రి నడిపి సుబ్బరాయుడు చెల్లించాడు. అప్పటి నుంచి ఆ డబ్బు మీ పుట్టింటి నుంచి తెచ్చివ్వాలంటూ సుబ్బరాయుడు కోడలిపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు భర్త రాజు కూడా వంతపాడాడు. ఇద్దరూ కలసి నిత్యం అనూరాధను కాల్చుకుతినేవారు. వారి వేధింపులు శృతిమించడంతో ఇక తట్టుకోలేకోయిన ఆమె జీవితంపై విరక్తితో ఉరేసుకుంది.
ముమ్మాటికీ హత్యే
తమ బిడ్డను అదనపు కట్నం కోసం అల్లుడితో పాటు అత్తమామలు వేధిస్తున్న మాట వాస్తవమేనని అనూరాధ తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదన్నారు. కచ్చితంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని ఆరోపించారు. నిందితులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించినట్లు ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.