
తన పిల్లలతో నేహామెహ్రోజ్
కరీంనగర్: రెండో వివాహం చేసుకుంటానంటూ శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న భర్త నుంచి రక్షించి న్యాయం చేయాలంటూ ఓ మహిళ పోలీసు ఉన్నతాధికారులను వేడుకుంటోంది. కరీంనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం విలేకరులతో స్థానిక శ్రీనగర్‌కాలనీకి చెందిన నేహా మెహ్రోజ్ తన ఆవేదనను వెల్లగక్కారు. 2007 ఆగస్టులో నగరంలోని శర్మనగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్‌మాజిద్‌తో తన వివాహమైందన్నారు.
పెళ్లి సమయంలో తన తండ్రి రూ.2.30 లక్షల నగదు, 10 తులాల బంగారాన్ని కానుకగా ఇచ్చారని తెలిపారు. తన భర్త సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తారని, తమకు ఇద్దరు ఆడపిల్లలని తెలిపారు. అయితే భర్త కొంతకాలంగా రెండో వివాహం చేసుకుంటానంటూ వేధిస్తున్నాడని, దానికి ఆడబిడ్డ వత్తాసు పలుకుతోందని వాపోయారు. రోజూ కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో సౌదీలో ఉన్నప్పుడు హత్యాయత్నం చేశారని ఆరోపించారు. భర్తతో ప్రాణహాని ఉందని, తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నానని కన్నీటి పర్యంతమయ్యా రు. ఈ విషయమై గతంలో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, కమిషనర్ గారు స్పందించి తన కు న్యాయం చేయాలని వేడుకున్నారు.