
ఉరేసుకుని మహిళ మృతి
కడప అర్బన్ : కడప నగరంలోని వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో సియోనుపురంలో షాహినా (28) అనే వివాహిత ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందింది. ఆరు సంవత్సరాల క్రితం సుధీర్ అనే యువకుడితో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి మూడు సంవత్సరాల కుమార్తె కూడా ఉంది. ఎంసీఏ వరకు చదువుకున్న షాహినా వివాహమైనప్పటి నుంచి ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండేది. ఓవైపు పుట్టిల్లు, మరోవైపు మెట్టినిల్లు బంధువులు ఎవరూ కూడా దగ్గరికి రానీయకపోవడంతోపాటు భర్త వేధింపులు తట్టుకోలేక గురువారం తాను ఉంటున్న ఇంటిలోనే ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈమె మృతి అనుమానాస్పదంగా ఉందని స్థానికులు, బంధువులు భావిస్తున్నారు. ఎవరూ లేని సమయంలో తలుపులు లోపల గడియ వేసుకుని ఉరి వేసుకోవడంతో వీఆర్వో సమక్షంలోనే పోలీసులు గడియ పగులగొట్టి లోనికి వెళ్లారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని స్థానికులు అనుకుంటున్నారు.