కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్ష చేపట్టిన బాధితురాలు చంద్రకళ
-
కలెక్టరేట్ ఎదుట బాధితురాలి రిలే నిరాహార దీక్ష
ఆదిలాబాద్ రిమ్స్ : అంగన్‌వాడీ ఉద్యోగం వచ్చినా జాయినింగ్ ఆర్డర్ ఇవ్వడం లేదని బేల మండలం సాంగ్వి గ్రామానికి చెందిన చంద్రకళ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట భర్త సురేశ్, పిల్లలతో కలిసి రిలే నిరాహార దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 2012లో ఏజెన్సీ అంగన్‌వాడీ కార్యకర్త కోసం నిర్వహించిన ఇంటర్వూ్యలో తాను ఎంపికయ్యాను. 2013లో ప్రోసిడింగ్ ఇచ్చారు. 2014 ఫిబ్రవరి 25న ఏజెన్సీ సర్టిఫికెట్ అడగడంతో వారం రోజుల్లో సంబంధిత కార్యాలయంలో అందించా. 2014 మార్చి 23న సాంగ్వి గ్రామ పెద్దల సమక్షంలో తనను అంగన్‌వాడీ కార్యకర్తగా తీర్మానం చేయించి వారి నుంచి సంతకాలు తీసుకొని ఐసీడీఎస్ కార్యాలయంలో అందించాం. అయితే ఉద్యోగం ఆర్డర్ కాపీ ఇవ్వాలంటే రూ.50 వేలు ఇస్తేనే కాపీ ఇస్తానంటూ ఆదిలాబాద్ రూరల్ సీడీపీవో ప్రభావతి డిమాండ్ చేసినట్లు ఆమె ఆరోపించారు. అయితే తాను అంత డబ్బు ఇచ్చుకోలేనని చెప్పడంతో ఆర్డర్‌కాపీ ఇవ్వలేదు. అప్పటి నుంచి కార్యాలయాలు, అధికారులు చుట్టూ తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. దిక్కుతోచని స్థితిలో రిలే నిరాహార దీక్ష చేపట్టాల్సి వచ్చింది. తనకు ఇప్పటికైనా న్యాయం చేయాలని బాధితురాలు కోరింది.