మహిళ ఆత్మహత్యాయత్నం
-
రక్షించిన స్థానికులు
-
పోలీసులకు అప్పగింత
రాజమహేంద్రవరం క్రైం:
భర్త వేధింపులను తాళలేని ఒక మహిళ తన కుమార్తెతో పాటు ఆత్మహత్యా యత్నం చేసుకుంది. అది గమనించిన స్థానికులు ఆ మహిళను, ఆమె పాపను రక్షించి పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. క్వారీ మార్కెట్ సెంటర్‌కు చెందిన ఎం. శ్రావణి అదే ప్రాంతానికి చెందిన రాజేష్‌ను వివాహం చేసుకుంది. రాజేష్ తరచూ మద్యం సేవించి వచ్చి అనుమానంతో భార్యను కొడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. అతనిపై శ్రావణి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వారు రాజేష్‌కు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికి అతనిలో మార్పు రాలేదు. దాంతో విరక్తి చెందిన శ్రావణి శుక్రవారం ఉదయం కోటిలింగాల ఘాట్ వద్ద సంవత్సరం వయస్సుగల కుమార్తెతో గోదావరి నదిలోకి దిగి ఆత్మహత్యకు పాల్పడేందుకు యత్నిస్తుండగా స్థానికులు గమనించి ఆమెను కాపాడి పోలీసులకు అప్పగించారు. త్రీటౌన్ సీఐ శ్రీ రామ కోటేశ్వరరావు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఆమెను చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.