- అపస్మారక స్థితిలో మహిళ
- లైంగికదాడి జరిగినట్టు అనుమానం
చేతులు కట్టి.. నోట్లో గుడ్డలు కుక్కి
Published Fri, Oct 7 2016 10:21 PM | Last Updated on Mon, Sep 4 2017 4:32 PM
రాజమహేంద్రవరం క్రైం :
రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్ సమీపంలోని బాలాజీ పేట పాత రైల్వేక్వార్టర్స్‌లోని ఒక ఖాళీ పోర్షన్‌లో గుర్తుతెలియని మహిళ అపస్మారక స్థితిలో ఉంది. ఆమె చేతులు వెనక్కి కట్టిఉండడం, నోట్లో గుట్టలు కుక్కి ఉండడంతో లైంగికదాడి జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ రైల్వే క్వార్టర్‌ను పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఉద్యోగికి కేటాయించారు. ఆయన త్వరలో రానున్నారు. ఈ నేపథ్యంలో దాన్ని శుభ్రం చేసేందుకు శుక్రవారం ఉదయం స్వీపర్లు వెళ్లారు. వారికి ఆ క్వార్టర్‌లోని ఓ గదిలో మహిళ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఆస్పత్రికి తరలింపు
రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ బి.రాజకుమారి హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళను 108లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఆ మహిళకు సుమారు 45 ఏళ్లు ఉంటాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను క్వార్టర్‌లోకి తీసుకువచ్చి లైంగికదాడికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.
తీవ్ర రక్తస్రావమై కోమాలోకి..
తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ మహిళ కోమాలోకి వెళ్లిపోయిందని వైద్యులు తెలిపారు. కోమా నుంచి బయటకు వస్తేగానీ నిజాలు తెలియవు. ఆ మహిళ ఆకు పచ్చని చీర, జాకెట్ ధరించి ఉంది. సంఘటనా స్థలంలో డాగ్ స్వాడ్, క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించాయి. అర్బన్ ఎస్పీ బి.రాజ కుమారితో పాటు సౌత్ జోన్ డీఎస్పీ నారాయణరావు, టూ టౌన్ సీఐ ఆర్‌జే రవికుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మహిళ ఆచూకీ తెలిసిన వారు టూ టౌన్ సీఐ 944079 6576, ఎస్సై 94932 06083, పోలీస్ స్టేషన్ 0883– 2421133కు సమాచారం ఇవ్వాలని కోరారు.
Advertisement
Advertisement