unconscious situation
-
7 నెలలుగా కోమాలో గర్భిణీ.. పండండి ఆడబిడ్డకు జన్మ
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 7 నెలలుగా అచేతన స్థితిలో ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఓ గర్భిణీ(23) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. గర్భిణీ యువతి గత వారం బిడ్డకు జన్మనిచ్చినట్లు ఢిల్లీ ఎయిమ్స్ ట్రామాకేర్ విభాగం వైద్యులు తెలిపారు. ఇప్పటికీ ఆ యువతి అచేతన స్థితిలోనే ఉందని, స్వతహాగా ఊపిరి తీసుకోగలుగుతున్నట్లు తెలిపారు. ఒక్కోసారి కళ్లు తెరిచి చూస్తోందని, కొన్ని సంవత్సరాల్లోనే తిరిగి మామూలు మనిషి అయ్యేందుకు 10-15 శాతం అవకాశం ఉందని వెల్లడించారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఈ ఏడాది మార్చి 31న గర్భిణీ మహిళ తన భర్తతో కలిసి బైక్‌పై వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో భార్యాభర్తలు హెల్మెట్ ధరించలేదు. దీంతో యువతి తలకు తీవ్ర గాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. భర్తకు ఎలాంటి తీవ్ర గాయాలు కాకపోవటంతో ఆయన కోలుకున్నారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బూలంద్శహర్లో జరిగింది. తొలుత బాధితురాలికి బులంద్‌శహర్‌లోని అబ్దుల్లా ఆసుపత్రిలో చికిత్స అందించారు. అక్కడి నుంచి ఏప్రిల్ 1న తెల్లవారుజామున ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు మార్చారు. తలకు తీవ్ర గాయాలవగా మెదడులో ఎముక ఉండిపోయినట్ల వైద్యులు గుర్తించారు. ఇప్పటి వరకు 5 రకాల న్యూరోసర్జికల్ ఆపరషన్లు నిర్వహించారు. ఆమె కళ్లు తెరుస్తుందని, కానీ కదల్లేని స్థితిలో ఉందని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ‘ప్రమాదం జరిగిన సమయానికి ఆమె 40 రోజుల గర్భిణీ. కడుపులో శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. కుటుంబ సభ్యులు అబార్షన్‌కు ఒప్పుకోలేదు. నెలలు నిండిన ఆమెకు అక్టోబర్ 22న ప్రసవం చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువు 2.5 కిలోలు ఉంది. తల్లి అచేతన స్థితిలో ఉండడం వల్ల బిడ్డకు పాలు ఇచ్చే ఆస్కారం లేదు. ప్రస్తుతానికి డబ్బా పాలే అందిస్తున్నాం. ’ అని డాక్టర్లు తెలిపారు. ఇదీ చదవండి: లాటరీలో ఎమ్మెల్యే భార్యకు రూ.కోటి జాక్‌పాట్.. బీజేపీ మనీలాండరింగ్ ఆరోపణ -
మతిస్థిమితం లేక.. తాగిన మైకంలో ఉరి వేసుకుని..
నవాబుపేట: తాగిన మైకంలో ఉరివేసుకొని ఓ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన ముబారక్ పూర్ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం చిన్నారివెల్లికి చెందిన యాదిష్ వెంకటయ్య(40) కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. బతుకుదెరువు కోసం భార్య యాదమ్మ, కూతుళ్లు సంతోష, సంధ్య, కుమారుడు శ్రీరామ్‌తో కలిసి నవాబుపేట మండలం ముబారక్ పూర్ గ్రామానికి వలస వచ్చి ఉంటున్నారు. గ్రామంలోని ఓ కోళ్ల ఫారంలో పని చేస్తున్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు అతను కింద పడటంతో తలకు గాయమైంది. అప్పటి నుంచి వెంకటయ్యకు మతిస్థిమితం సరిగ్గా పనిచేయడం లేదు. దానికి తోడు మద్యానికి బానిస అయ్యాడు. శనివారం రాత్రి తాగిన మైకంలో అర్ధరాత్రి వేళ పక్కన ఉన్న రేకుల షెడ్డు లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని భార్య యాదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ వెంకటేశం తెలిపారు. -
ఏడాదిన్నర తర్వాత.. అదే బీచ్‌లో.. అవే దుస్తులతో
సుకబూమి(ఇండోనేసియా) : ఇండోనేసియాలో ఓ నమ్మలేని ఘటన చోటుచేసుకుంది. 2017 జనవరిలో నైనింగ్ సున్సారి అనే మహిళ సుకబూమిలోని సిటేపస్ బీచ్‌లో అలల దాటికి కొట్టుకుపోయారు. ఫ్యామిలీతో కలసి హాలిడేకు వెళ్లిన నైనింగ్ బీచ్‌లో సరదాగా గడుపుతున్న సమయంలో పెద్ద అల రావడంతో ప్రవాహంలో చిక్కుకున్నారు. అలల తీవ్రత అధికంగా ఉండటంతో కుటుంబసభ్యులు ఆమెను రక్షించలేని స్థితిలో ఉండిపోయారు. అధికారులు కూడా ఆమె కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. అయిన ఫలితం లేకపోయింది. కనీసం ఆమె మృతదేహం అయిన దొరకాలని బంధువులు కోరుకున్నారు. కానీ అది కూడా సాధ్యపడలేదు.. దీంతో అధికారులు ఆమె మరణించినట్టు ప్రకటించారు. తీరా చూస్తే.. 18 నెలల తర్వాత శనివారం రోజున ఆమె అదే బీచ్‌లోని ఇసుకలో అపస్మారక స్థితిలో కనిపించారు.ఆమె అలల దాటికి గురయినప్పుడు ఏ దుస్తులైతే ధరించిందో.. అవే దుస్తుల్లో ఆమె కనిపించినట్టు ఇండోనేసియా మీడియా పేర్కొంది. ప్రస్తుతం ఆమెను వైద్య పరీక్షలు నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య కదలికలు స్థిరంగానే ఉన్నప్పటికీ.. పూర్తి స్థాయిలో కొలుకోవాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై నైనింగ్ కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. నైనింగ్ అలల దాటికి కొట్టుకుపోయినప్పటికీ.. ఆమె ఆచూకీ లభించకపోవడంతో బతికి ఉంటుందనే ఆశ తమలో సజీవంగానే ఉందని తెలిపారు. నెల రోజుల నుంచి నైనింగ్ తండ్రికి ఆమెకు సంబంధించి కలలు రాసాగాయని వారు పేర్కొన్నారు. దీంతో తాము బీచ్‌లో నైనింగ్ కోసం వెతకడం ప్రారంభించామని.. చివరికి తమ అన్వేషణ ఫలించదన్నారు. -
పీహెచ్సీలో ప్రసవానికి వైద్యుల నిరాకరణ
కొయ్యలగూడెం : ప్రసవం కోసం పీహెచ్‌సీకి వెళ్లిన గర్భిణికి పురుడు పోసేందుకు వైద్యులు నిరాకరించిన ఘటన ఇది. దీంతో ఆమె ఇంటిలోనే ప్రసవించి అపస్మారకస్థితికి చేరుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పాతపరింపూడిలోని మారుమూల నివసిస్తున్న యడ్లపల్లి వెంకటలక్ష్మికి మూడో కాన్పుకు పురుడు పోసుకోవడానికి 15వ తేదీ కొయ్యలగూడెం ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే పురుడు పోయడానికి వైద్యులు నిరాకరించారని, ఆసుపత్రిలో చేర్చుకోకుండానే పరీక్షలు నిర్వహించి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా పంపించి వేసినట్టు భర్త వెంకన్న తెలిపాడు. దీంతో ఇంటికి తీసుకుని రాగా మంగళవారం ఉదయం వెంకట లక్ష్మికి పురిటినొప్పులు ఎక్కువై డెలివరీ అయ్యిందని, పాప పుట్టిన కొద్ది నిమిషాలకే వెంకటలక్ష్మి అపస్మారక స్థితిలోకి వెళ్లిందని వెంకన్న విలపించాడు స్థానిక ప్రైవేట్ వైద్యులు వెంకట లక్ష్మిని పరిశీలించి వెంటనే రాజమండ్రి తరలించాల్సిందిగా పేర్కొన్నారని, గంగిరెద్దులతో యాచక వృత్తి కొనసాగించే తనకు ఆర్థికస్థోమత లేదని వాపోయాడు. 16వ తేదీ వచ్చిన భారీ వానకు పూరింటిలోకి నీరు చేరిందని, పురుడు పోసుకోవడానికి తన భార్యను పడుకోబెట్టడానికి సరైన ప్రదేశం లేకపోయిందని తెలిపాడు. ఇరుగుపొరుగు మహిళలు కష్టం మీద ఆమెకు పురుడు పోశారని తెలిపాడు. స్థానికుల సహాయంతో వెంకటలక్ష్మిని రాజమండ్రికి తరలించారు. దీనిపై వైద్యారోగ్య శాఖ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నించగా వారెవరూ అందుబాటులో లేరు. -
భవనం పైనుంచి పడిపోయిన విద్యార్థి
పెందుర్తి: పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనంపై నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థి ప్రమాదవశాత్తు జారి పడిపోయాడు. ఓ భవనం నుంచి మరో భవనం పైకి దూకే ప్రయత్నంలో అదుపు తప్పి కిందపడిపోయాడు. దీంతో తలకు తీవ్రగాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గురువారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లి మారేడుపుడి కాలనీకి చెందిన ముద్దిర్ని రాము కుమారుడు సాయి పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్నాడు. కళాశాలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా కంచరపాలెంలోని పెద్దమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. గురువారం ఉదయం 8.30 సమయంలో కళాశాలకు వచ్చిన సాయి ప్రధాన గేటు ద్వారా లోపలికి వచ్చాడు. తన తరగతి గది అదనపు భవనంలో ఉండడంతో సులువుగా ఉంటుందని కళాశాల ప్రధాన భవనం మీదకి వెళ్లి అదనపు భవనం వైపు దూకాడు. అయితే అదుపుతప్పి అదనపు భవనం పోర్టుకోకు తగిలి కింద పడిపోయాడు. దీంతో తలకు తీవ్రగాయమై అక్కడిక్కడే అపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. తక్షణమే స్పందించిన తోటి విద్యార్థులు, స్థానికులు ఆటోలో సాయిని కేజీహెచ్‌కు తరలించారు. సాయి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పెందుర్తి పోలీసులు ఘటనాస్థలిని సందర్శించి వివరాలు సేకరించారు. సీఐ మురళి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
చేతులు కట్టి.. నోట్లో గుడ్డలు కుక్కి
అపస్మారక స్థితిలో మహిళ లైంగికదాడి జరిగినట్టు అనుమానం రాజమహేంద్రవరం క్రైం : రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్ సమీపంలోని బాలాజీ పేట పాత రైల్వేక్వార్టర్స్లోని ఒక ఖాళీ పోర్షన్లో గుర్తుతెలియని మహిళ అపస్మారక స్థితిలో ఉంది. ఆమె చేతులు వెనక్కి కట్టిఉండడం, నోట్లో గుట్టలు కుక్కి ఉండడంతో లైంగికదాడి జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ రైల్వే క్వార్టర్‌ను పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఉద్యోగికి కేటాయించారు. ఆయన త్వరలో రానున్నారు. ఈ నేపథ్యంలో దాన్ని శుభ్రం చేసేందుకు శుక్రవారం ఉదయం స్వీపర్లు వెళ్లారు. వారికి ఆ క్వార్టర్లోని ఓ గదిలో మహిళ కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆస్పత్రికి తరలింపు రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ బి.రాజకుమారి హుటాహుటీన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ మహిళను 108లో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కాగా.. ఆ మహిళకు సుమారు 45 ఏళ్లు ఉంటాయి. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను క్వార్టర్లోకి తీసుకువచ్చి లైంగికదాడికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. తీవ్ర రక్తస్రావమై కోమాలోకి.. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ మహిళ కోమాలోకి వెళ్లిపోయిందని వైద్యులు తెలిపారు. కోమా నుంచి బయటకు వస్తేగానీ నిజాలు తెలియవు. ఆ మహిళ ఆకు పచ్చని చీర, జాకెట్ ధరించి ఉంది. సంఘటనా స్థలంలో డాగ్ స్వాడ్, క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలు సేకరించాయి. అర్బన్ ఎస్పీ బి.రాజ కుమారితో పాటు సౌత్ జోన్ డీఎస్పీ నారాయణరావు, టూ టౌన్ సీఐ ఆర్జే రవికుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మహిళ ఆచూకీ తెలిసిన వారు టూ టౌన్ సీఐ 944079 6576, ఎస్సై 94932 06083, పోలీస్ స్టేషన్ 0883– 2421133కు సమాచారం ఇవ్వాలని కోరారు.