సుకబూమి(ఇండోనేసియా) : ఇండోనేసియాలో ఓ నమ్మలేని ఘటన చోటుచేసుకుంది. 2017 జనవరిలో నైనింగ్ సున్సారి అనే మహిళ సుకబూమిలోని సిటేపస్ బీచ్‌లో అలల దాటికి కొట్టుకుపోయారు. ఫ్యామిలీతో కలసి హాలిడేకు వెళ్లిన నైనింగ్ బీచ్‌లో సరదాగా గడుపుతున్న సమయంలో పెద్ద అల రావడంతో ప్రవాహంలో చిక్కుకున్నారు. అలల తీవ్రత అధికంగా ఉండటంతో కుటుంబసభ్యులు ఆమెను రక్షించలేని స్థితిలో ఉండిపోయారు. అధికారులు కూడా ఆమె కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. అయిన ఫలితం లేకపోయింది. కనీసం ఆమె మృతదేహం అయిన దొరకాలని బంధువులు కోరుకున్నారు. కానీ అది కూడా సాధ్యపడలేదు.. దీంతో అధికారులు ఆమె మరణించినట్టు ప్రకటించారు.
తీరా చూస్తే.. 18 నెలల తర్వాత శనివారం రోజున ఆమె అదే బీచ్‌లోని ఇసుకలో అపస్మారక స్థితిలో కనిపించారు.ఆమె అలల దాటికి గురయినప్పుడు ఏ దుస్తులైతే ధరించిందో.. అవే దుస్తుల్లో ఆమె కనిపించినట్టు ఇండోనేసియా మీడియా పేర్కొంది. ప్రస్తుతం ఆమెను వైద్య పరీక్షలు నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య కదలికలు స్థిరంగానే ఉన్నప్పటికీ.. పూర్తి స్థాయిలో కొలుకోవాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై నైనింగ్ కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. నైనింగ్ అలల దాటికి కొట్టుకుపోయినప్పటికీ.. ఆమె ఆచూకీ లభించకపోవడంతో బతికి ఉంటుందనే ఆశ తమలో సజీవంగానే ఉందని తెలిపారు. నెల రోజుల నుంచి నైనింగ్ తండ్రికి ఆమెకు సంబంధించి కలలు రాసాగాయని వారు పేర్కొన్నారు. దీంతో తాము బీచ్‌లో నైనింగ్ కోసం వెతకడం ప్రారంభించామని.. చివరికి తమ అన్వేషణ ఫలించదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment