
వద్దే.. వద్దు
మార్టూరులో మద్యం దుకాణం నిర్మాణాన్ని అడ్డుకున్న మహిళలు
మార్టూరు : మండల కేంద్రమైన మార్టూరులో నూతనంగా ఏర్పాటు చేయబోయిన మరో మద్యం దుకాణం నిర్మాణాన్ని స్థానిక మహిళలు అడ్డుకున్నారు. స్థానిక నాగరాజుపల్లి రోడ్డులోని కాకతీయ నగర్ సమీపంలో కొత్తగా మద్యం దుకాణం నిర్మాణానికి నిర్వాహకులు పనులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న స్థానిక మహిళలు ఆందోళనకు దిగారు. మద్యం దుకాణం నిర్మాణాన్ని అడ్డుకున్నారు. నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటుకు ససేమిరా అన్నారు. తమకు ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిందని, షాపు నిర్మాణాన్ని అడ్డుకోవద్దని నిర్వాహకులు కోరారు.
లైసెన్స్ ఉంటే దుకాణం మీ ఇళ్ల వద్ద పెట్టుకోండంటూ మహిళలు తెగేసి చెప్పారు. ఇళ్ల మధ్య దుకాణం పెడితే సహించేది లేదని మహిళలు హెచ్చరించారు. విషయం తెలుసుకున్న హెడ్ కానిస్టేబుల్ వివేక్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి వచ్చి ఆందోళనకారులను వారించే ప్రయత్నం చేశారు. అప్పటికీ మహిళలు శాంతించలేదు. చేసేది లేక షాపు నిర్మాణాన్ని పోలీసులు నిలిపి వేయించడంతో వివాదం సద్దుమణిగింది.