పనులు పరుగెత్తాలి
ఏలూరు (మెట్రో) : జిల్లాలో జల రవాణా మార్గాన్ని పునరుద్ధరించే పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ కె.భాస్కర్ ఆదేశించారు. ఈ పనులకు అవసరమైన భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్ట్‌లు, జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే లైన్ విస్తరణ పనుల ప్రగతిపై అధికారులతో శనివారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇన్‌ల్యాండ్ వాటర్ వేస్‌ప్రాజెక్ట్‌లో భాగంగా జిల్లాలో 74 కిలోమీటర్ల పొడవునా ఏలూరు కాలువను ఆధునికీకరించాల్సి ఉందని చెప్పారు. రోడ్లపై ట్రాఫిక్‌ను తగ్గించడంతోపాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ సామగ్రిని తరలించేందుకు జల రవాణా ఉపయోగపడుతుందన్నారు. నిడదవోలు–ఏలూరు మధ్య ప్రధాన కాలువను వెడల్పు చేసి ఓడల ద్వారా సరుకుల రవాణా చేసేందుకు వీలుగా 35 గ్రామాలు, ఏలూరు, తాడేపల్లిగూడెంలలో భూసేకరణ చేపడుతున్నట్టు వివరించారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్ట్‌లు, జాతీయ రహదారులకు సంబంధించి భూములను అప్పగించిన వెంటనే పనులు చేపట్టాల్సిన బాధ్యత కాంట్రాక్ట్ ఏజెన్సీలపై ఉందన్నారు. రైతులకు మేలు కలగాలనే సంకల్పంతో పనులు చేయాలని సూచించారు. పోగొండ రిజర్వాయర్ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్, స్పెషల్ కలెక్టర్ సీహెచ్ భానుప్రసాద్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి షాన్‌మోహన్, ఎస్‌డీసీ సూర్యనారాయణ, హౌసింగ్ ప్రాజెక్ట్ అధికారి ఇ.శ్రీనివాస్, ఆర్ అండ్ బీ ఎస్‌ఈ నిర్మల, డ్వామా పీడీ ఎం.వెంకటరమణ పాల్గొన్నారు.