గిరిజనుల అభివృద్ధి బాటలు
ఆదివాసీ దినోత్సవంలో కలెక్టర్ మిశ్రా
రంపచోడవరం : గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపి వారిని అభివృద్ధి బాటలో పయనించేందుకు కృషి చేస్తామని, ఇందుకు అనేక పథకాలు అమలు చేస్తున్నట్టు కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో బుధవారం పీఎంఆర్‌సీ ఆవరణలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన నిరుద్యోగ యువతకు స్దానికంగా స్టడీ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వినియోగించుకుని ఐదు వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. టీఎస్‌పీ ని«ధులు సక్రమంగా వినియోగిస్తూ, జీఓ నెం.3 ద్వారా స్థానిక గిరిజనులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. గిరిజన సంఘాలు అధికారులకు తోడ్పాటును అందించాలని కోరారు. ఎమ్మెల్సీ టి.రత్నాబాయి మాట్లాడుతూ గిరిజనులు హక్కుల పరిరక్షణకు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు.
జూనియర్ కళాశాల నుంచి ప్రదర్శన
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు, గిరిజనులు, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కొమ్ము డ్యాన్సు, రేలా పాటలతో ర్యాలీ పీఎంఆర్‌సీ వరకు సాగింది. కలెక్టర్, పీఓ ఏఎస్ దినేష్‌కుమార్ అడ్డాకులతో చేసిన టోపీలు పెట్టారు. పీఎంఆర్‌సీ వద్ద ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్‌ను కలెక్టర్ సందర్శించారు.ఈ కార్యక్రమంగా కేవీకే ద్వారా 30 కుట్టుమిషన్లు, రూ.1.50 కోట్ల బ్యాంక్ లింకేజ్, రబ్బరు విభాగం ద్వారా పవర్ టిల్లర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబురమేష్, ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు పత్తిగుళ్ల భారతి, ఆర్డీఓ రామ్మోహనరావు, ఏపీఓ నాయుడు, సర్పంచి వై.నిరంజనీదేవి, మాజీ సర్పంచి మంగా బొజ్జయ్య, ఎంపీటీసీ కారుకోడి పూజా, ఏజెన్సీలోని ఏడు గిరిజన తెగలకు చెందిన పెద్దలు పాల్గొన్నారు.