వామ్మో..పెద్ద పులి!
- నల్లమల సమీప గ్రామాల్లో సంచారం
చిన్నకంబలూరు (ఆళ్లగడ్డ): నల్లమల అటవీ సమీపంలోని చిన్నకంబలూరు, పేరూరు, ఈదుబై కొట్టాల ప్రాంతాల్లో పెద్దపులి సంచారం ప్రజల్లో భయాందోళన కల్గిస్తోంది. వారం రోజులుగా పంట పొలాల్లో ఇది సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ విషయం తెలిసి..పొలాల్లోకి వెళ్లేందు రైతులు, కూలీలు జంకుతున్నారు. అటవీ అధికారులకు సమాచారం అందడంతో సోమవారం..వారు పులి సంచార ప్రాంతాలకు వెళ్లి పగ్ మార్క్‌లు ( పులి పాదాల గుర్తులను ) సేకరించారు. సేకరించిన గుర్తులను నంద్యాల అటవీ కార్యాలయానికి తీసుకెళ్లి పరిశీలించగా అవి పెద్ద పులి పాదాలని తేలింది. ఈ సందర్భంగా చలమ రేంజి అధికారి సూర్యచంద్రరాజు మాట్లాడుతూ.. చిన్నకంబలూరు, పేరూరు సమీప గ్రామాల్లో పెద్ద పులి వారం రోజులుగా సంచరిస్తూ, తిరిగి నల్లమల అడవిలోకి వెళ్తోందన్నారు. పూర్తి నిర్ధారణ చేసి ప్రజలకు సమాచారం ఇస్తామని.. అంతవరకు అటవీ సిబ్బంది, గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలన్నారు.