► దామరచర్ల విద్యుత్ కేంద్రం భూ సేకరణ పరిహారం మంజూరు
► భూ పరిహారం కింద రూ.162 కోట్లు..
► పునరావాసానికి మరో రూ.102 కోట్లు
► నల్లగొండ జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేయనున్న జెన్‌కో
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా దామరచర్లలో 4000 మెగావాట్ల భారీ సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం అవసరాల కోసం సేకరించనున్న భూములకు పరిహారంగా తెలంగాణ జెన్‌కో రూ.285.81 కోట్ల ప్యాకేజీని మంజూరు చేసింది. 2013లో అమల్లోకి వచ్చిన కొత్త భూసేకరణ చట్టం కింద ఈ ప్యాకేజీని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు అవసరాల కోసం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, జెన్‌కోకు దామరచర్ల మండలం వీర్లపాలెం, దిలావర్‌పూర్, గంగాదేవిగట్టు గ్రామాల పరిధిలోని 1892.35 హెక్టార్ల అటవీ భూములను పరస్పర భూముల బదలాయింపు పద్ధతిలో కేటాయించింది. ఈ భూముల్లోనే 879.09 ఎకరాల పట్టా/డీ-ఫారం పట్టా/యూడీఏఎఫ్‌ఏ/అసైన్డ్ భూములతో పాటు 920.25 ఎకరాల ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టా(సాగులో ఉన్న అటవీ భూములు) భూములున్నాయి. స్థానిక గిరిజన కుటుంబాలు ఈ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో యాదాద్రి విద్యుత్ కేంద్రం అవసరాల కోసం ఈ భూములను సేకరించేందుకు జెన్‌కో తాజా ప్యాకేజీని మంజూరు చేసింది.
ఇందులో పరిహారం కింద రూ.162.81 కోట్లు, బాధిత కుటుంబాలకు పునరావసం కల్పించడానికి రూ.102.80 కోట్లను కేటాయించింది. మౌలిక వసతుల అభివృద్ధికి రూ.16 కోట్లు, పరిపాలన, ఇతర అవసరాల కోసం రూ.4 కోట్లను ఈ ప్యాకేజీలో కేటాయించింది. బాధితులకు పరిహారం చెల్లించి తక్షణమే భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసేందుకు నల్లగొండ జిల్లా కలెక్టర్ ఖాతాలో ఈ నిధులను జమ చేయనుంది. మొడుగులకుంట, కపూర తండాల పరిధిలో 181 కుటుంబాల నుంచి భూముల సేకరణ కోసం జిల్లా కలెక్టర్ గత అక్టోబర్ 4న ప్రకటన జారీ చేశారు. యాదాద్రి విద్యుత్ కేంద్రం ప్రాజెక్టు అంచనాల్లో భూ సేకరణ అవసరాల కోసం మొత్తం రూ.845 కోట్ల నిధులను జెన్‌కో కేటాయించింది. అందులో స్థానిక గిరిజనులకు ప్రకటించిన రూ.285.81 కోట్ల ప్యాకేజీని ఈ కింది అవసరాల కోసం వినియోగించనున్నారు.
‘యాదాద్రి’ భూ పరిహారం రూ. 285 కోట్లు !
Published Thu, Jan 7 2016 12:43 AM | Last Updated on Sun, Sep 3 2017 3:12 PM
Advertisement