ఎర్రగంగ.. దీనంగా..
ఎర్రగంగ.. దీనంగా..
Published Mon, Sep 5 2016 1:39 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
తాడేపల్లిగూడెం : ‘ఒరేయ్ ఎంకా ఎర్రగంగొస్తోందిరోయ్.. మన కొంపమునిగిందిరో’ ఈ మాటలు వానాకాలంలో మెట్ట ప్రాంత రైతుల నుంచి తరచూ వినిపించేవే. ఎర్రకాలువ ప్రవాహం ప్రతి ఏటా ఇక్కడి అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 20 గ్రామాల ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. పంటలను అమాంతం మింగేస్తోంది. దీనికి ప్రధాన కారణం కాలువ విస్తరణ పనులు జరగకపోవడమే
ఎర్ర కాలువ వల్ల మెట్ట ప్రాంత రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తక్షణ చర్యలు ప్రారంభించారు. చెక్‌డ్యామ్‌ల పునర్నిర్మాణం, అవసరమైన చోట్ల కాలువల విస్తరణ పనులపై దృష్టిపెట్టారు. సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు
తీసుకునేలోగానే ఆయన అమరుడయ్యారు. దీంతో పనుల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఆ తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, రూ.121.83 కోట్లతో అనంతపల్లి నుంచి నందమూరు అక్విడెక్టు వరకూ ఎర్రకాలువ విస్తరణకు శ్రీకారం చుట్టారు. ఈ పనులకు 2013 ఏప్రిల్ 7న అప్పటి కేంద్ర మంత్రి చిరంజీవి తాడేపల్లిగూడెం మండలం మాధవరం వద్ద శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభమై మూడేళ్లు దాటిపోయింది. వాస్తవానికి ఏడాదికే పనులు పూర్తికావాలి. కానీ ఇప్పటికీ మోక్షం కలగలేదు. నందమూరు పాత ఆక్విడెక్టు తొలగింపు వ్యవహారం కొలిక్కిరాలేదు. దీంతో ఎర్రకాలువ పరీవాహక ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. పనులు పూర్తికాక ఏటా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాగుతూనే..
కాలువ విస్తరణ పనులను ఐదు రీచ్‌లుగా విభజించారు. నల్లజర్ల మండలం అనంతపల్లిలో 0.00 కిలోమీటరు నుంచి నందమూరు ఆక్విడెక్టు వద్ద 33.370 కిలో మీటరు వరకు ఎర్రకాలువ విస్తరణ, చెక్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదనలు చేశారు. ప్రముఖ కంపెనీలకు ఈ పనులను అప్పగించారు. అయితే భూసేకరణ సమస్య వల్ల కొంతకాలం పనులు ముందుకు సాగలేదు. త్యాజంపూడి. గుండేపల్లి, వీరంపాలెం ప్రాంతాలలో భూసేకరణ కొలిక్కిరాలేదు. ఇటీవలి కాలంలో వీరంపాలెం ప్రాంతంలో కొంత ప్రాంతం మినహా సమస్య పరిష్కారమైంది. అయినా పనులు వేగం పుంజుకోలేదు. పేరున్న హైగ్రీవ ఇన్‌ఫ్రా, ఆర్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా వంటి సంస్థలు ఈ పనులను చేజిక్కించుకున్నాయి. అయినా ఏడాదిలోపు పూర్తికావాల్సిన పనులు ఇంకా సగంలోనే ఉన్నాయి.
పెరిగిన అంచనాలు
నిర్దేశించిన ప్రకారం పనులు ముందుకు సాగకపోవడం, మెటీరియల్ ధరలు పెరగడం తదితర కారణాల నేపథ్యంలో ప్రత్యేక జీఓ ద్వారా ప్రభుత్వం విస్తరణ పనులకు నిధులు పెంచింది. రూ.121.83 కోట్లుగా నిర్ణయించిన ఈ పనుల వ్యయాన్ని రూ.143 కోట్ల 15 లక్షల 40 వేలకు పెంచుతూ గత ఏడాది ఫిబ్రవరి ఐదో తేదీన జీవో నంబర్ 69 విడుదల చేసింది. ముందనుకున్న అంచనాలకంటే సుమారు రూ.22 కోట్ల వ్యయం పెంచినా, పనుల ప్రగతిలో చెప్పుకోతగ్గ మార్పులేదు.
కాంట్రాక్టర్ వెనకడుగు
ఏడాదిలోపు పనులు పూర్తిచేయనందువల్ల కాంట్రాక్టు సంస్థలకు 50 సీ క్లాజు ప్రకారం మూడు నోటీసులు ఇచ్చారు. దీని ప్రకారం కాంట్రాక్టు రద్దు చేసే అవకాశాలున్నాయి. ఈ పనులలో కొన్ని రీచ్‌లను చేజిక్కించుకున్న ఆర్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా పనుల నుంచి తప్పుకుంటామని చెబుతోంది. దీంతో ఈ పనులు వేరేసంస్థకు అప్పగించాల్సి ఉంది.
55శాతమే పూర్తి
విస్తరణ పనులు ఇప్పటివరకూ 55 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఇన్‌లెట్స్ ఆఫ్‌టెక్ స్లూయిస్ (తూములు) , క్యాటిట్ ర్యాంప్స్ (పశువులు నీరు తాగడానికి ర్యాంపులు) ఏర్పాటు, గ్రావెల్ రోడ్లు, గట్ల పటిష్టత పూర్తయిన తర్వాత నందమూరు అక్విడెక్టు తొలగింపు పనులు పూర్తిచేయాల్సి ఉంది. కొంత దూరం పాటు కాలువల విస్తరణ పనులు జరిగిన చోట గట్ల పటిష్ట పనులు చేపట్టాల్సి ఉంది. అప్పారావుపేట వంటి చోట్ల ఇంకా ఈ పనులు మిగిలి ఉన్నాయి. జగన్నా«థపురం నుంచి నందమూరు వరకు ఈ పనులు చాలా చేయాల్సి ఉంది.
అప్పారావుపేట – కోరుమామిడి వంతెన సమీపంలో చినబాపన్నకోడు. పెదబాపన్నకోడు చెక్ డ్యామ్‌లు, రామరాజు గట్టు పటిష్ట పరచాల్సి ఉంది. బాపన్నకోడు నుంచి ముష్టికోడు కాలువ, ఇతర కాలువలను విస్తరించాల్సి ఉంది.
పూర్తయితే..
విస్తరణ పనులు పూర్తయితే పదివేల ఆయకట్టు స్థిరీకరణకు అవకాశం ఉంటుంది. పదివేల ఎకరాల ఆయకట్టు ఉన్నా, విస్తరణ జరగకపోవడం, ఆక్రమణ చెరలో చెరువులు, వాటి కింద బోదెలను పూడ్చివేసిన నేపథ్యంలో వానాకాలంలో పంట చేలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో ఎర్రకాలువ నీరు కేవలం నాలుగువేల ఎకరాలకు మించి అందని దుస్థితి నెలకొంది. కాలువ ఆక్రమణలు, గట్టు చిక్కిపోవడం, గండ్లు తదితర కారణాల వల్ల 4,500 క్యూసెక్కుల నీరు మాత్రమే ఈ కాలువ ద్వారా దిగువ ప్రాంతాలకు వెళుతోంది. పూర్తిస్థాయిలో పనులు పూర్తయితే 20,250 క్యూసెక్కుల నీరు ఈ కాలువ ద్వారా ప్రవహిస్తుంది.
వానాకాలం తర్వాత పనులు
వర్షాల వల్ల పనులకు అంతరాయం కలిగిందని, వానాకాలం తర్వాత విస్తరణ æపనులు తిరిగి ప్రారంభమవుతాయని ఇరిగేషన్ డీఈలు అప్పారావు, వెంకటేశ్వర్లు తెలిపారు. 55 శాతం పనులు పూర్తయ్యాయని, రెండు నుంచి ఐదో రీచ్‌వరకు పనులను పూర్తిచేయాల్సి ఉందని పేర్కొన్నారు.
Advertisement