widening
-
ఇష్టారాజ్యంగా రోడ్డు విస్తరణ... వంద ఫీట్ల రోడ్డును 85 ఫీట్లకే కుదిస్తున్నారు
తాండూరు టౌన్: పట్టణం మీదుగా వెళ్తున్న నేషనల్ హైవే లింకు రోడ్డు విస్తరణ పనులు అడ్డదిడ్డంగా కొనసాగుతున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి అన్నారు. మంగళవారం పలువురు నాయకులతో కలిసి ఎన్‌హెచ్ 167 రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిధులతో బూత్పూర్ నుంచి కర్ణాటకలోని మన్నెకెళ్లి వరకు నేషనల్ హైవే పనులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తాండూరు పట్టణం గుండా హైవేకు కలిపే లింక్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. రోడ్డు విస్తరణకు వంద ఫీట్ల వరకు ఉండాలని హైవే అధికారులు నిర్ణయించగా.. కేవలం 85 ఫీట్లు మాత్రమే విస్తరణ జరుగుతోందన్నారు. పలువురు బీఆర్ఎస్ నాయకులు భవనాలను కూల్చేయకుండా ఆయా ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా 85 ఫీట్ల మేరకు మాత్రమే విస్తరిస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన రోడ్డు విస్తరణ పనులపై తాండూరు ప్రజలకు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, రోడ్డు కాంట్రాక్టరు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. గతంలో నిర్మించిన రోడ్డు డివైడర్‌పైనే సిమెంటు పూత పూసి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. అధికార పార్టీ నాయకుల ఆస్తులను కాపాడేందుకే రోడ్డు ఇరుకుగా నిర్మిస్తున్నారన్నారు. అక్రమాలపై నేషనల్ హైవే అథారిటీ అధికారుల ఫిర్యా దు చేస్తామని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రమేశ్‌కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను తామే తెచ్చినట్లుబీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఈనెల 22న తాండూరుకు రానున్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్తామని తెలిపారు. వీరివెంట పార్టీ పట్టణ అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ రజినీకాంత్, మున్సిపల్ ఫ్లో ర్ లీడర్ అంతారం లలిత, కౌన్సిలర్ సాహు శ్రీలత, జిల్లా కార్యదర్శి భద్రేశ్వర్ తదితరులు ఉన్నారు. -
పెరిగిన ఇండిగో నష్టాలు
న్యూఢిల్లీ: అధిక వ్యయాల భారం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ విమానయాన దిగ్గజం ఇండిగో (ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్) నష్టాలు మరింత పెరిగాయి. రూ. 1,583 కోట్లకు చేరాయి. గత క్యూ2లో నష్టాలు రూ. 1,436 కోట్లు. సమీక్షా కాలంలో ఆదాయం రూ. 5,799 కోట్ల నుంచి రూ. 12,852 కోట్లకు పెరిగింది. రెండో త్రైమాసికంలో మొత్తం వ్యయాలు రూ. 14,436 కోట్లకు పెరిగాయి. వరుసగా రెండో త్రైమాసికంలో కోవిడ్ పూర్వ స్థాయికి మించి కార్యకలాపాలు నమోదు చేసినట్లు ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ తెలిపారు. ‘సీజనల్‌గా రెండో త్రైమాసికంలో కార్యకలాపాలు బలహీనంగా ఉంటాయి కానీ, డిమాండ్ బాగుండటంతో మెరుగైన పనితీరు సాధించగలిగాం. అయితే, ఇంధన ధరలు, కరెన్సీ మారకం రేట్లు మా ఆర్థిక పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపాయి‘ అని ఆయన వివరించారు. దేశ, విదేశ మార్కెట్లలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ రికవరీ బాటలో స్థిరంగా ముందుకు వెడుతున్నామని ఎల్బర్స్ పేర్కొన్నారు. -
పూర్తి కావొచ్చిన సూర్యాపేట–ఖమ్మం రహదారి
సాక్షి,హైదరాబాద్: సూర్యాపేట–ఖమ్మం మధ్య నిర్మిస్తున్న నాలుగు వరుసల జాతీయ రహదారి పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. సెప్టెంబరు చివరికల్లా రోడ్డు పనులు పూర్తికానుండటంతో వెంటనే ప్రారంభించి జాతికి అంకితం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రోడ్డు అందుబాటులోకి రావటం వల్ల హైదరాబాద్–ఖమ్మం మధ్య ప్రయాణ సమయం దాదాపు గంట వరకు తగ్గిపోనుంది. సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు నాలుగు వరుసల రోడ్డు అందుబాటులో ఉండగా, సూర్యాపేట నుంచి ఖమ్మం మధ్య ఇంతకాలం రెండు వరుసల రోడ్డే ఉండేది. రోడ్డు కూడా బాగా దెబ్బతినిపోవడంతో ప్రయాణ సమయం బాగా పెరుగుతూ, తరచూ ప్రమాదాలకు నెలవుగా మారింది. దీంతో దీన్ని నాలుగు వరుసలకు విస్తరించాలని నిర్ణయించిన కేంద్రం 2019లో ఈ ప్రాజెక్టుకు అనుమతి మంజూరు చేసింది. కోవిడ్ కారణంగా పనుల్లో కొంత జాప్యం జరిగింది. దీంతో మూడు నెలల అదనపు సమయాన్ని నిర్మాణ సంస్థకు మంజూరు చేశారు. ఫలితంగా సెప్టెంబరు చివరి నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 58.63 కిలోమీటర్లకు ఇప్పటికే 49.55 కి.మీ. మేర పనులు పూర్తయ్యాయి. (క్లిక్: బ్లాక్ ఫిల్మ్‌లు, నంబర్ ప్లేట్లపై నజర్.. స్పెషల్ డ్రైవ్) -
మరింత పెరిగిన వాణిజ్య లోటు
సాక్షి, న్యూఢిల్లీ: ఒకవైపు వాణిజ్యలోటు అందోళన పెరుగుతోంటే అక్టోబర్ నెల నాటి గణాంకాలు మరింత ఆందోళన కరంగా వెలువడ్డాయి. అక్టోబరు వాణిజ్య లోటు 17.13 బిలియన్ డాలర్లకు పెరిగింది. అధిక ఆయిల్ ఇంపోర్ట్ బిల్ వాణిజ్య లోటు విస్తరించిందని వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబరులో వాణిజ్య లోటు 13.98 బిలియన్ డాలర్లుగా ఉంది. అక్టోబర్ నెలలో ఎగుమతులు 17.86 శాతం పెరిగి 26.98 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.దిగుమతులు 17.62 శాతం పెరిగి 44.11 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ముడి దిగుమతిదారు ఇండియా, విదేశీ మార్కెట్ల నుండి చమురును 80 శాతం కొనుగోలు చేస్తోంది. అక్టోబర్ నెలలో దేశంలో చమురు దిగుమతులు 14.21 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అంతకుముందు సంవత్సరం 52.64 శాతంగా నమోదైంది. -
మరింత పెరిగిన వాణిజ్యలోటు
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల ఆర్థిక వ్యవస్థకు ఆందోళన కరంగా మారిన వాణిజ్య లోటు తాజాగా మరింత భయపెడుతోంది. మే నెలలో వాణిజ్య లోటు 14.62 బిలియన్ డాలర్లకు పెరిగింది. దిగుమతులు 15 శాతం పెరిగాయని ప్రభుత్వం వెల్లడించింది. మే మాసానికి సంబంధించిన ట్రేడ్ డెఫిసిట్ 14.62 బిలియన డాలర్లుగా నమోదైందని వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు ప్రకటించారు. గత ఏడాది ఇదే కాలానికి వాణిజ్య లోటు 13.85 బిలియన్ల డాలర్లుగా ఉంది. ఎగుమతులు 28.86 బిలియన్ డాలర్లు. గత ఏడాది 24.01 బిలియన్ డాలర్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 20.18శాతం వృద్ధిని సాధించాయి. దిగుమతులు 43.38 బిలియన్ డాలర్లు. వార్షిక ప్రాతిపదికన 14.85 శాతం వృద్ధిని నమోదు చేశాయి. దిగుమతులు గత ఏడాది 37.86 బిలియన్ డాలర్లుగా ఉంది. ముడి చమురు దిగుమతులు 49.46 శాతం పెరిగి 11.5 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగడంతో దిగుమతులు పెరిగాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. -
విస్తరణ.. మలుపు!
రోడ్డు వెడల్పు పనుల్లో అడ్డంకి – టీడీపీ నేత భవంతి విషయంలో ఆచితూచి – అనుమతి లేకున్నా అక్రమ కట్టడం – విస్తరణ పనుల కంటే ముందుగానే నిర్మాణం – చేష్టలుడిగి చూస్తున్న మున్సిపల్ యంత్రాంగం – నిలిచిపోయిన రోడ్డు వెడల్పు పనులు సాక్షి ప్రతినిధి, కర్నూలు: రోడ్డు వెడల్పు పనుల్లోనూ అధికార పార్టీ హవా కొనసాగుతోంది. ప్రభుత్వ, ప్రై వేటు స్థలాలను అడ్డంగా కొట్టేసిన కార్పొరేషన్ అధికారులు.. సరిగ్గా రోడ్డు వెడల్పు పనులు అవసరమైన చోట అధికార పార్టీ నేత భవంతి ఉందనే కారణంగా నెమ్మదించారు. పైగా రోడ్డు నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకుండానే 10 అడుగుల స్థలం ఇచ్చేశానని చెబుతూ.. కనీసం అనుమతి తీసుకోకుండానే నిర్మాణాలు కూడా చేపట్టారు. అంతేకాదు.. ఈ భవంతి కోసం ఏకంగా రోడ్ల వెడల్పు పనులను కూడా నెమ్మదించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కృష్ణా పుష్కరాల పనుల్లో జలమండలి నుంచి రైల్వే స్టేషన్ వరకు చేపట్టిన రోడ్డు వెడల్పు పనుల్లో సాగుతున్న తతంగం ఇదీ. వాస్తవానికి రైల్వే స్టేషన్‌కు సరిగ్గా ఎదుటనున్న ఈ భవంతి వద్ద రోడ్డు వెడల్పు చేయకపోతే మొత్తం రోడ్ల విస్తరణ పనులకే అర్థం లేకుండా పోతుంది. ఎందుకంటే సరిగ్గా ఇక్కడే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అయితే, ఈ భవంతిని కూల్చకుండా.. 10 అడుగుల స్థలం ఇచ్చేందుకు ముందుకొచ్చాడనే పేరుతో కనీసం అనుమతి లేకుండా నిర్మాణం సాగిస్తున్నా కార్పొరేషన్ అధికారులు కిమ్మనకుండా ఉండిపోతున్నారు. ఇందుకు ఆయన అధికార పార్టీ నేత కావడమే కారణమని తెలుస్తోంది. హడావుడి పనులు వాస్తవానికి కృష్ణా పుష్కరాలల్లో భాగంగా కర్నూలు కార్పొరేషన్లో అనేక పనులు చేపట్టారు. ఇందులో భాగంగా కోటి రూపాయలకు పైగా వ్యయంతో ఐదు రోడ్ల కూడలి(జలమండలి) నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు వెడల్పు, డివైడర్ల ఏర్పాటుకు టెండర్లను పిలిచారు. ఈ పనులను అధికార పార్టీ నేత చేజిక్కించుకున్నారు. మొదట్లో జెట్ స్పీడుతో పనులు సాగాయి. పుష్కరాల్లోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అవి కాస్తా కాకపోవడంతో ఇప్పుడు పనులు నెమ్మదించాయి. ఇందులోనూ మొదట్లో ఇటు జలమండలి కార్యాలయం, అదనపు ఎస్పీ కార్యాలయం వంటి ప్రభుత్వ స్థలాలతో పాటు కేవీఆర్ కాలేజీకి చెందిన ప్రహరీ గోడను కూడా అంతే వేగంగా కూల్చివేశారు. అయితే, అధికార పార్టీ నేత భవనం జోలికి మాత్రం పోకుండా జాగ్రత్తపడ్డారు. అక్కడికొచ్చే సరికి.. పుష్కరాల్లో భాగంగా చేపట్టిన ఈ పనులు మొదట్లో వేగంగా చేపట్టారు. తీరా అధికార పార్టీకి చెందిన నేత భవంతి రావడంతో పనులు నెమ్మదించాయి. సరిగ్గా ఈ భవనానికి ఎదురుగా ఉన్న షాపులను కూల్చివేసిన అధికారులు ఈ భవనం జోలికి మాత్రం పోలేదు. తీరిగ్గా కోర్టుకు వెళ్లి పద్ధతి ప్రకారం(డ్యూ ప్రాసెస్) రోడ్ల వెడల్పు చేపట్టాలని ఆదేశాలు తెచ్చే వరకూ అధికారులు ఆగారు. తీరా కోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత మీ భవంతిని కూలుస్తామని నోటీసులు జారీచేశారు. ఇందుకు స్పందించిన సదరు అధికార పార్టీ నేత, భవన యజమాని టైటిల్ డెవలప్మెంట్ రైట్స్(టీడీఆర్) కింద 10 అడుగుల స్థలం ఇస్తానని ముందుకొచ్చారు. అయితే, దీనిపై ఇంకా కార్పొరేషన్ అధికారులు మార్కింగ్ కూడా చేయలేదు. ఇవేవీ జరగకుండా కనీసం అనుమతి తీసుకోకుండా నిర్మాణాలు మాత్రం చేపడుతున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఎర్రగంగ.. దీనంగా..
తాడేపల్లిగూడెం : ‘ఒరేయ్ ఎంకా ఎర్రగంగొస్తోందిరోయ్.. మన కొంపమునిగిందిరో’ ఈ మాటలు వానాకాలంలో మెట్ట ప్రాంత రైతుల నుంచి తరచూ వినిపించేవే. ఎర్రకాలువ ప్రవాహం ప్రతి ఏటా ఇక్కడి అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 20 గ్రామాల ప్రజలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. పంటలను అమాంతం మింగేస్తోంది. దీనికి ప్రధాన కారణం కాలువ విస్తరణ పనులు జరగకపోవడమే ఎర్ర కాలువ వల్ల మెట్ట ప్రాంత రైతులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తక్షణ చర్యలు ప్రారంభించారు. చెక్‌డ్యామ్‌ల పునర్నిర్మాణం, అవసరమైన చోట్ల కాలువల విస్తరణ పనులపై దృష్టిపెట్టారు. సమస్య పరిష్కారానికి శాశ్వత చర్యలు తీసుకునేలోగానే ఆయన అమరుడయ్యారు. దీంతో పనుల్లో ప్రతిష్టంభన నెలకొంది. ఆ తరువాత కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, రూ.121.83 కోట్లతో అనంతపల్లి నుంచి నందమూరు అక్విడెక్టు వరకూ ఎర్రకాలువ విస్తరణకు శ్రీకారం చుట్టారు. ఈ పనులకు 2013 ఏప్రిల్ 7న అప్పటి కేంద్ర మంత్రి చిరంజీవి తాడేపల్లిగూడెం మండలం మాధవరం వద్ద శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభమై మూడేళ్లు దాటిపోయింది. వాస్తవానికి ఏడాదికే పనులు పూర్తికావాలి. కానీ ఇప్పటికీ మోక్షం కలగలేదు. నందమూరు పాత ఆక్విడెక్టు తొలగింపు వ్యవహారం కొలిక్కిరాలేదు. దీంతో ఎర్రకాలువ పరీవాహక ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. పనులు పూర్తికాక ఏటా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగుతూనే.. కాలువ విస్తరణ పనులను ఐదు రీచ్‌లుగా విభజించారు. నల్లజర్ల మండలం అనంతపల్లిలో 0.00 కిలోమీటరు నుంచి నందమూరు ఆక్విడెక్టు వద్ద 33.370 కిలో మీటరు వరకు ఎర్రకాలువ విస్తరణ, చెక్ డ్యామ్‌ల నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదనలు చేశారు. ప్రముఖ కంపెనీలకు ఈ పనులను అప్పగించారు. అయితే భూసేకరణ సమస్య వల్ల కొంతకాలం పనులు ముందుకు సాగలేదు. త్యాజంపూడి. గుండేపల్లి, వీరంపాలెం ప్రాంతాలలో భూసేకరణ కొలిక్కిరాలేదు. ఇటీవలి కాలంలో వీరంపాలెం ప్రాంతంలో కొంత ప్రాంతం మినహా సమస్య పరిష్కారమైంది. అయినా పనులు వేగం పుంజుకోలేదు. పేరున్న హైగ్రీవ ఇన్ఫ్రా, ఆర్ఎస్ఆర్ ఇన్ఫ్రా వంటి సంస్థలు ఈ పనులను చేజిక్కించుకున్నాయి. అయినా ఏడాదిలోపు పూర్తికావాల్సిన పనులు ఇంకా సగంలోనే ఉన్నాయి. పెరిగిన అంచనాలు నిర్దేశించిన ప్రకారం పనులు ముందుకు సాగకపోవడం, మెటీరియల్ ధరలు పెరగడం తదితర కారణాల నేపథ్యంలో ప్రత్యేక జీఓ ద్వారా ప్రభుత్వం విస్తరణ పనులకు నిధులు పెంచింది. రూ.121.83 కోట్లుగా నిర్ణయించిన ఈ పనుల వ్యయాన్ని రూ.143 కోట్ల 15 లక్షల 40 వేలకు పెంచుతూ గత ఏడాది ఫిబ్రవరి ఐదో తేదీన జీవో నంబర్ 69 విడుదల చేసింది. ముందనుకున్న అంచనాలకంటే సుమారు రూ.22 కోట్ల వ్యయం పెంచినా, పనుల ప్రగతిలో చెప్పుకోతగ్గ మార్పులేదు. కాంట్రాక్టర్ వెనకడుగు ఏడాదిలోపు పనులు పూర్తిచేయనందువల్ల కాంట్రాక్టు సంస్థలకు 50 సీ క్లాజు ప్రకారం మూడు నోటీసులు ఇచ్చారు. దీని ప్రకారం కాంట్రాక్టు రద్దు చేసే అవకాశాలున్నాయి. ఈ పనులలో కొన్ని రీచ్‌లను చేజిక్కించుకున్న ఆర్ఎస్ఆర్ ఇన్ఫ్రా పనుల నుంచి తప్పుకుంటామని చెబుతోంది. దీంతో ఈ పనులు వేరేసంస్థకు అప్పగించాల్సి ఉంది. 55శాతమే పూర్తి విస్తరణ పనులు ఇప్పటివరకూ 55 శాతం మాత్రమే పూర్తయ్యాయి. ఇన్లెట్స్ ఆఫ్‌టెక్ స్లూయిస్ (తూములు) , క్యాటిట్ ర్యాంప్స్ (పశువులు నీరు తాగడానికి ర్యాంపులు) ఏర్పాటు, గ్రావెల్ రోడ్లు, గట్ల పటిష్టత పూర్తయిన తర్వాత నందమూరు అక్విడెక్టు తొలగింపు పనులు పూర్తిచేయాల్సి ఉంది. కొంత దూరం పాటు కాలువల విస్తరణ పనులు జరిగిన చోట గట్ల పటిష్ట పనులు చేపట్టాల్సి ఉంది. అప్పారావుపేట వంటి చోట్ల ఇంకా ఈ పనులు మిగిలి ఉన్నాయి. జగన్నా«థపురం నుంచి నందమూరు వరకు ఈ పనులు చాలా చేయాల్సి ఉంది. అప్పారావుపేట – కోరుమామిడి వంతెన సమీపంలో చినబాపన్నకోడు. పెదబాపన్నకోడు చెక్ డ్యామ్‌లు, రామరాజు గట్టు పటిష్ట పరచాల్సి ఉంది. బాపన్నకోడు నుంచి ముష్టికోడు కాలువ, ఇతర కాలువలను విస్తరించాల్సి ఉంది. పూర్తయితే.. విస్తరణ పనులు పూర్తయితే పదివేల ఆయకట్టు స్థిరీకరణకు అవకాశం ఉంటుంది. పదివేల ఎకరాల ఆయకట్టు ఉన్నా, విస్తరణ జరగకపోవడం, ఆక్రమణ చెరలో చెరువులు, వాటి కింద బోదెలను పూడ్చివేసిన నేపథ్యంలో వానాకాలంలో పంట చేలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో ఎర్రకాలువ నీరు కేవలం నాలుగువేల ఎకరాలకు మించి అందని దుస్థితి నెలకొంది. కాలువ ఆక్రమణలు, గట్టు చిక్కిపోవడం, గండ్లు తదితర కారణాల వల్ల 4,500 క్యూసెక్కుల నీరు మాత్రమే ఈ కాలువ ద్వారా దిగువ ప్రాంతాలకు వెళుతోంది. పూర్తిస్థాయిలో పనులు పూర్తయితే 20,250 క్యూసెక్కుల నీరు ఈ కాలువ ద్వారా ప్రవహిస్తుంది. వానాకాలం తర్వాత పనులు వర్షాల వల్ల పనులకు అంతరాయం కలిగిందని, వానాకాలం తర్వాత విస్తరణ æపనులు తిరిగి ప్రారంభమవుతాయని ఇరిగేషన్ డీఈలు అప్పారావు, వెంకటేశ్వర్లు తెలిపారు. 55 శాతం పనులు పూర్తయ్యాయని, రెండు నుంచి ఐదో రీచ్వరకు పనులను పూర్తిచేయాల్సి ఉందని పేర్కొన్నారు.