యువత పెడదారి | Young boys have gone for the jalsas | Sakshi
Sakshi News home page

యువత పెడదారి

Published Mon, Jul 17 2017 6:01 AM | Last Updated on Wed, Sep 18 2019 3:26 PM

యువత పెడదారి - Sakshi

యువత పెడదారి

జల్సాల కోసం నేరాల బాట
చోరీల్లో 80 శాతం యువకులే
మట్కా, పేకాటలోనూ అదేస్థాయిలో
ఇలాగైతే భవిష్యత్‌ నాశనమే

ఆదిలాబాద్‌: దేశానికి యువతే వెన్నెముక అంటారు. కొంతమంది యువత మంచిదారిలో వెళ్తూ అద్భుత ఆవిష్కరణలతో సత్తా చాటుతుంటే.. మరికొందరు చెడుదారిని ఎంచుకుని భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. హత్యలు, చోరీలు, దోపిడీలకు పాల్ప డుతూ నేరస్తులుగా మారుతున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పటివరకు దొంగతనాల్లో పట్టుబడ్డ నిందితుల్లో ఎక్కువ శాతం మంది 20నుంచి 30 సంవత్సరాల లోపు యువతే ఉండడం గమనార్హం. ఈ ఏడాది ఎన్నో చోరీ, మట్కా, పేకాట కేసుల్లో అరెస్టయిన వారిలో ఎక్కువగా యువకులే ఉన్నారు. వీరంతా జల్సాల కోసమే నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. జిల్లాలో ఇంటర్మీడియెట్, డిగ్రీ వరకు చదువుకున్న పలువురు ఈజీమనీ కోసం నేరస్తులుగా మారుతున్నారు.

జిల్లాలో ఇలా..
జిల్లాలో ఇటీవల జరిగిన దొంగతనాలు, ఇతర నేరాలను పరిశీలిస్తే ఈ నేరాల్లో 80శాతం మంది యువతే ఉన్నారు. జల్సాల కోసం దొంగతనాలు చేస్తున్న వారు కొందరైతే.. తక్కువ సమయంలో డబ్బు సంపాదించాలనే దురుద్దేశంతో మట్కా, పేకాటవైపు మొగ్గు చూపుతున్నారు. చోరీ కేసుల్లోని యువత చైన్‌స్నాచింగ్, ద్విచక్ర వాహనాలు, తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు.

ఒంటరి మహిళ కనిపిస్తే చాలు.. వారి మెడలోంచి బంగారాన్ని లాక్కెళ్తున్నారు. వీరు కరుడుగట్టిన నేరగాళ్లనుకుంటే పొరపాటే. ఉన్నత చదువులు చదువుతున్నవారు జల్సాలకు అలవాటు పడి అడ్డదారులు తొక్కుతున్నారు. మరికొంత మంది యువత తక్కువ సమయంలో డబ్బులకు ఆశపడి మట్కా, పేకాట ఆడుతున్నారు. వీరు పట్టుబడినప్పటికీ మళ్లీమళ్లీ అదేదారిలో నడుస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే సినిమాల ప్రభావం యువతపై ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్‌మీడియాను సైతం యువత చెడుకు ఉపయోగించుకుంటోంది.

ఇటీవల జిల్లా కేంద్రంలో పట్టుబడ్డ సురేశ్‌ అనే యువకుడు యూట్యూబ్‌లో నేరాల కథనాలు చూసి దొంగతనాలు చేశాడంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరదాగా మొదలైన ఈ చెడును.. రానురాను వ్యసనంగా మార్చుకుంటున్నారు. ఇటీవల ఇంటర్మీడియెట్‌ చదివి వదిలేసిన ఓ యువకుడు జిల్లా కేంద్రంలో మహిళల మెడలోంచి గొలుసు చోరీలకు పాల్పడుతుండగా పోలీసులు అరెస్ట్‌ చేశారు. కొట్టేసిన గొలుసులను విక్రయించి వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నారు. దొరికితే జైలు పాలవుతున్నారు.

దొంగతనాలకు ఇవీ కారణాలు..
ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలని, వీలైతే అందినంత దోచుకుని ఎదగాలనే ఆలోచన రావడం.
ఎదుటి వ్యక్తి విలువైన దుస్తులు, షూలు ధరిస్తే తాము అలాగే వేసుకోవాలని ఆశపడడం.
పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, సినిమాలకు ప్రభావితమై జల్సాలు చేయాలనుకోవడం.


తల్లిదండ్రులు ఇవీ పాటించాలి..
పిల్లలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి. పిల్లలు చదువుకునే సమయంలోనే వారి స్నేహం, నడవడికపై దృష్టిపెట్టాలి.
తల్లిదండ్రులను కాదని సొంతంగా డబ్బులు ఖర్చుపెడుతున్నారంటే జాగ్రత్తగా ఉండాలి. డబ్బుల విషయంలో వారికి అవగాహన కల్పించాలి.
సమాజంలో హోదా, గౌరవం, సంప్రదాయాలు, విలువలు, నిజాయితీ, పద్ధతులపై అవగాహన కల్పించాలి.


ఇటీవల చోరీ కేసుల్లో అరెస్టయిన యువకులు..
జల్సాలకు అలవాటు పడి వరుస చైన్‌ స్నాచింగ్‌లకు పాల్పడుతూ తప్పించుకుంటున్న ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన ఆరెపల్లి సురేశ్‌ (25)ను ఈనెల 11న పోలీసులు అరెస్ట్‌ చేశారు. యూట్యూబ్‌లో నేరాలపై కథనాలు చూసి ప్రభావితమై జల్సాల కోసం డబ్బులు లేక దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఇటీవల ఇతడిని అరెస్ట్‌ చేసి 30 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

ఆదిలాబాద్‌కు చెందిన 25 ఏళ్ల ఎండీ మోయిజ్‌ 40 దొంగతనాల కేసుల్లో నిందితుడు. ఈ యువకుడు జల్సాలకు అలవాటు పడి వరుస దొంగతనాలు చేశాడు. ఈనెల 4న పక్కా సమాచారంతో సీసీఎస్‌ పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ మోయిజ్‌ను అరెస్టు చేశారు. 73 గ్రాముల బంగారం, 700 గ్రా ముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

జూన్‌ 22న మహారాష్ట్రకు చెందిన ఐదుగురు యువకులు ఆదిలాబాద్‌ పట్టణంలో వరుస బైక్‌ చోరీలకు పాల్పడుతుండగా పోలీసులు అరెస్టు చేశారు. మద్యానికి బానిసై జల్సాల కోసం అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో జిల్లా కేంద్రంలో మూడు నెలలు వరుసగా ద్విచక్ర వాహనాలు దొంగిలించి పట్టుబడ్డారు.


మంచి మార్గంలో వెళ్తే ఉపాధి
యువత మంచి మార్గంలో వెళ్తే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. జల్సాలకు అలవాటు పడి భవిష్యత్‌ నాశనం చేసుకోకూడదు. విద్యార్థులు కూడా చెడువ్యసనాలకు దూరంగా ఉండాలి. ప్రస్తుతం నేరాల కు పాల్పడుతున్న యువతపైన నిఘా ఉంచాం. ఆయా కేసుల్లో పట్టుబడిన తర్వాత తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం.
– ఎం.శ్రీనివాస్, ఎస్పీ

ఈ ఏడాది నేరాలు, నిందితులు
దొంగతనాలు:        50
నిందితులు:        30
యువకులు:        25
స్వాధీనం చేసుకున్న సొత్తు120 తులాల బంగారం,140 తులాల వెండి, రూ.25.80 లక్షల నగదు
20 ద్విచక్ర వాహనాలు,ఒక స్కార్పియో
మట్కా కేసులు:        69
నిందితులు:        156
యువకులు:        67
స్వాధీనం చేసుకున్న నగదు రూ. 98,700
పేకాట కేసులు:        82
నిందితులు:        126
యువకులు:        82
స్వాధీనం చేసుకున్న నగదు రూ. 7.59 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement