
అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి
పెద్దకారంపల్లె (రాజంపేట రూరల్): అనంతపురం జిల్లా నార్పల మండలానికి చెందిన అరకటవేముల రామాంజనేయులు(30) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇతని మృతదేహం శనివారం పెద్దకారంపల్లె పంచాయతీ పరిధిలోని కృష్ణమ్మ చెరువు గుంతలో లభ్యమైంది. కాగా మృతుడు అధికార పార్టీకి చెందిన ఓ నేత క్రషర్‌లో పనిచేసేవాడని, అక్కడ జరిగిన బ్లాస్టింగ్‌లో శుక్రవారం మృతి చెంది ఉంటాడని, దీంతో మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా చెరువులో పడేసి ఉంటారని ఆరోపణలు వెలువడుతున్నాయి. కాగా మృతుని సంబంధీకులు మాత్రం చేపల కోసం ఔట్లు పెట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు భావించారు. ఇదిలా ఉండగా రామాంజనేయులు మృతి విషయంలో సంబంధీకులతో బేరసారాలు జరిపి కొంత నగదు ఇచ్చేలా క్రషర్ నిర్వాహకులు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. రామాంజనేయులుకు ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు. సమాచారం తెలుసుకున్న సీఐ కర్నాటకం హేమసుందర్‌రావు, ఎస్‌ఐ నాగరాజు, ఏఎస్‌ఐ రమణలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి సంబంధీకులతో పూర్తి వివరాలను సేకరించారు. ఆ మేరకు చేపలు పట్టేందుకు వెళ్లి ఔట్లు పేల్చి మృతి చెందినట్లుగా కేసు నమోదు చేశామని ఎస్‌ఐ నాగరాజు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.