కాటేయబోయిన అల
-
రక్షించిన లైఫ్ గార్డ్స్
బీచ్‌రోడ్ : రాకాసి అలలు ఇద్దరు యువకులను కాటేయబోయాయి. అక్కడే ఉన్న లైఫ్ గార్డ్స్ ఎంతో శ్రమించి వారిని రక్షించారు. ఈ సంఘటన ఆదివారం ఆర్కే బీచ్‌లో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ముక్కవీధి, జాలారిపేటకు చెందిన జి.ఎల్లాజి (24), వి.పైడిరాజు (24) కార్పెంటర్లు. వారు ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఆర్కే బీచ్‌కు వచ్చారు. స్నానం చేయడానికి ఎల్లాజి సముద్రంలోకి దిగగా ఉధృతంగా వచ్చిన కెరటం లోపలకు లాగేసింది. అతడిని కాపాడే క్రమంలో పైడిరాజు అలలకు చిక్కాడు. సందర్శకుల సమాచారంతో లైఫ్‌గార్డ్స్ వి.దేవుడు, టి.పోలారావు, వి.ఎల్లాజి రంగంలోనికి దిగారు. ప్రాణాలను పణంగా పెట్టి గంటసేపు శ్రమించి యువకులను రక్షించారు. వీరికి మెరైన్ పోలీసులు సహాయం చేశారు. అనంతరం వారికి ప్రథమ చిక్సిత చేయించి ఇంటికి పంపించారు.
ఇదీ పునర్జన్మ
సముద్రం అంచునే స్నానం చేస్తున్నా.. ఇంతలో పెద్ద కెరటం వచ్చి లోపలకు లాక్కుపోయింది. నన్ను రక్షించటానికి వచ్చిన నా స్నేహితుడు సముద్రంలో చిక్కుకున్నాడు. నేను అయితే ప్రాణాల మీద ఆశ వదిలేశాను. లైఫ్‌గార్డ్స్ మా ఇద్దరిని రక్షించి పునర్జన్మ ఇచ్చారు.
–జి.ఎల్లాజి
లోపలకు లాగేసింది..
నా స్నేహితుడు కెరటాలకు చిక్కుకోవటం చూసి ఆందోళనకు గురయ్యా. ఏమి చేయాలో తెలియక నేను లోనికి వెళ్లా. రాకాసి అల నన్ను లోపలకు లాగేసింది. సమయానికి లైఫ్‌గార్డ్స్ వచ్చి మమ్మల్ని కాపాడారు. జీవితాంతం వారిని గుర్తుంచుకుంటాం.
–వి.పైడిరాజు