
యువతి మౌనపోరాటం
బాపట్లలో భర్త ఇంటి ఎదుట నిరాహార దీక్ష చేపట్టిన అనూష
బాపట్ల : ప్రేమించి పెళ్లి చేసుకుని ఇప్పుడు కాపురానికి రానివ్వడంలేదంటూ ఓ వివాహిత తన భర్త ఇంటి ఎదుట శుక్రవారం రాత్రి నుంచి నిరాహార దీక్ష చేపట్టింది. తాను కాపురానికి వెళ్లినప్పటికి అత్త, మామ, భర్త నువ్వు ఇక్కడ ఉండవద్దంటూ మళ్లీ తీసుకువచ్చి పుట్టింటి వద్దే వదిలేస్తున్నారంటూ భోరున విలపించింది. బాధితురాలి కధనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
పట్టణంలోని వివేకానందకాలనీలో కాపురం ఉంటున్న దేవూరి పిచ్చియ్య, వేలంగిణి కుమారుడు వికాస్ చీరాల మండలం రామానగర్‌కు చెందిన పి.నాగేశ్వరరావు,చిన్నమ్మాయిల కుమార్తె అనూష ప్రేమించుకున్నారు. వీరికి పెళ్లి చేసేందుకు వికాస్ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో పెద్దలు రాజీ చేసి కట్నం క్రింద రూ.10 లక్షలు, 25 సవర్ల బంగారం ఇచ్చేందుకు ఒప్పించారు. గతేడాది ఏప్రియల్ 28న విజయవాడలో వివాహం చేశారు. తొలివిడతగా కట్నంలో రూ.4లక్షలు 25 సవర్లు బంగారం ఇచ్చారు. ఐదునెలలు తరువాత మిగతా సొమ్ము కూడా ఇచ్చేశారు.అప్పటి నుంచి అత్తింటివారు అనూషపై వేధింపులు మొదలు పెట్టి పుట్టింటికి పంపించివేశారు.
పోలీసులను ఆశ్రయించినా ఫలితం శూన్యం
అనూష తనకు న్యాయం చేయాలంటూ చీరాల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సెలింగ్‌లు ఇచ్చినా ఫలితం లేకుండాపోయింది. చివరికి ఈనెల 16న కౌన్సెలింగ్‌లో తాను అనూషతో కాపురం చేసేదిలేదని, జైలుకైనా పంపండంటూ వికాస్ చెప్పి రావడంతో అనూష మనస్తాపానికి గురైంది. బాపట్లలో అత్తింటి వద్దే తేల్చుకుంటానంటూ వచ్చి నిరాహార దీక్ష చేపట్టింది. అనూష బంధువులు కూడా అనూషతో పాటు పిచ్చియ్య ఇంటి వద్దనే నిరాహారదీక్ష చేపట్టారు. దీంతో అత్తమామ, భర్త అక్కడ నుంచి పరారయ్యారు. న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని అనూష బంధువులు చెబుతున్నారు.