మీ పనితీరేం బాగోలేదు!
– చెత్త సమస్య ఇప్పటి వరకు నెరవేరలేదు
– శానిటేషన్ అధికారులు, సిబ్బందిపై ఆర్‌డీ ఆగ్రహం
కర్నూలు (టౌన్): నగరంలో చెత్త సమస్యను పరిష్కరించడం లేదు. ఎన్నిసార్లు మీకు చెప్పాలి. మీ పనితీరేం బాగోలేదు అని మున్సిపల్ రీజినల్ డైరెక్టర్ విజయలక్ష్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం సాయంత్రం స్థానిక నగరపాలకలోని సమావేశ భవనంలో పారిశుద్ధ్య, రెవెన్యూ విభాగాలతో ఆర్‌డీ సమీక్ష నిర్వహించారు. డివిజన్ల వారీగా శానిటరీ ఇన్‌స్పెక్టర్ల పనితీరు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టిప్పర్ల సమస్య ఉందని చెబుతున్నారు... ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు. మూడు నెలలుగా సమస్య ఉంటే ఎందుకు పరిష్కరించుకోలేదని వారిని ప్రశ్నించారు. మీ నిరా్వకంతో నగరంలో పారిశుద్ధ్య పనులు సక్రమంగా జరగడం లేదన్నారు. జమ్మి చెట్టు నుంచి గార్గేయపురం కంపోస్టు యార్డుకు చెత్త తరలించడంలో సమస్యలు వస్తున్నాయన్నాయన్నారు.
కంపోస్టు యార్డు వద్ద పర్యవేక్షణ లేకపోవడంతో చెత్త తరలింపు అధ్వానంగా తయారయ్యిందని మండిపడ్డారు. వారానికి ఒకరు చొప్పున్న శానిటరీ ఇన్‌స్పెక్టర్ కంపోస్టుయార్డు, జమ్మిచెట్టు వద్ద పర్యవేక్షణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జీవో 279 ప్రకారం వర్కర్లను టెండర్ ద్వారా తీసుకుని ఇంటింటి చెత్త సేకరణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. రెవెన్యూ విభాగానికి సంబంధించి పన్నుల వసూళ్లు వందశాతం చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎస్. రవీంద్రబాబు, డిప్యూటీ కమిషనర్ రామలింగేశ్వర్, ఇన్‌చార్జీ పర్యావరణ ఇంజినీరు రాధకృష్ణ, రెవెన్యూ అధికారులు వీరస్వామి, మల్లిఖార్జున, రెవెన్యూ ఇన్సె్పక్టర్లు పాల్గొన్నారు.