తాళ్లపూడి: పెద్దేవం గ్రామంలో బుధవారం ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. పెద్దేవానికి చెందిన తాటిపాక మనోజ్(18) ఎలక్ట్రీషియన్‌గా తాడిపూడి గ్రామ పంచాయతీతో పాటు పలుచోట్ల పని చేస్తున్నాడు. అతనికి గ్రామానికి చెందిన 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికతో ప్రేమ వ్యవహరం ఉంది. ఈ విషయం తెలిసి గతంలో మనోజ్‌ను ఆ బాలిక బంధువులు మందలించారు. ఈ క్రమంలో బుధవారం బాలిక ఇంట్లోని బెడ్‌రూంలో మంచంపై అతను విగత జీవిగా కనిపించాడు. ఈ విషయం తెలిసి మనోజ్ కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మృతిపై అనుమానాలు
మనోజ్ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి తల్లి వెంకటలక్ష్మి, తండ్రి వెంకటరావు మాత్రం తన కొడుకుని కావాలనే తీసుకెళ్లి చంపేసారని ఆరోపించారు. మంగళవారం రాత్రి సుమారు 7 గంటలకు ఫోన్ రావడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లాడని ఇప్పుడు ఇలా ఆ అమ్మాయి ఇంట్లో శవమై పడిఉన్నాడని విలపించారు. మంగళవారం రాత్రి చనిపోతే మధ్యాహ్నం వరకు ఆ విషయాన్ని ఎందుకు దాచారని ప్రశ్నించారు. గతంలో ఓ సారి ఆ బాలిక బంధువులు తమ ఇంటికి వచ్చి చంపేస్తామని బెదిరించారని. అతని ఒంటిపైన, ముఖం మీద దెబ్బలు ఉన్నాయని ఇది హత్యే అన్నారు. పథకం ప్రకారం తమ కుమారుడిని చంపేశార న్నారు. తమ కుటుంబానికి ఏకైక ఆసరా అయిన కుమారుడు లేకుండా పోయాడని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
నాకేమీ తెలీదు : బాలిక
మంగళవారం రాత్రి తన ఇంటికి వచ్చి ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడని, తనకు ఏమీ తెలియదని ఆ బాలిక చెబుతోంది. పక్కగదిలో కుటుంబ సభ్యులు ఉన్నారని, ఆమె తండ్రి రాజమండ్రి ఆసుపత్రి పనిమీద వెళ్లారని చెబుతున్నారు. పోలీసులు, సీఐ వివరాలు సేకరించారు. సీఐ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో విచారణ, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కేసును ఛేదిస్తామన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని చెప్పారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
Published Thu, Jun 2 2016 12:07 PM | Last Updated on Mon, Sep 4 2017 1:30 AM
Advertisement
Advertisement