
బాబు నిర్వాకం వల్లే వడ్డీ భారం
♦ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
♦ అనంతపురంలో 4వ విడత యాత్ర పూర్తి.. 28 కుటుంబాలకు జగన్ భరోసా
(రైతు భరోసా యాత్ర నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి)
‘అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తా. మహిళలు బ్యాంకులకు ఒక్క రూపాయి కూడా కట్టొదు. బ్యాంకు అధికారులు అడిగితే కట్టేది లేదని నిక్కచ్చిగా చెప్పండని ఎన్నికల ముందు చంద్రబాబు గొప్పగా హామీలు గుప్పించారు. తీరా పీఠమెక్కాక హామీలన్నింటినీ అటకెక్కించారు. చంద్రబాబు నిర్వాకం వల్లే ఇవాళ డ్వాక్రా అక్కచెల్లెమ్మలపై వడ్డీ భారం పడింది.’అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లాలో ఆప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఈ నెల 6 నుంచి అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్ చేపట్టిన రైతు భరోసా యాత్ర మంగళవారం(12వ తేదీ) చెన్నేకొత్తపల్లి మండలంలో దిగ్విజయంగా ముగిసింది. చివరిరోజు మండలంలోని వెంకటాంపల్లి, బసంపల్లి గ్రామాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతులు వన్నా వెంకట్రామిరెడ్డి, సోమశేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మా ప్రభుత్వం వచ్చాక ఆర్థికసాయం...
బసంపల్లిలో ఆత్మహత్య చేసుకున్న రైతు సోమశేఖర్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. మృతుడి భార్య మాలతమ్మ జగన్‌ను చూడగానే కన్నీరుమున్నీరయ్యింది. తల్లి బాధను చూసి ఆరేళ్ల కుమారుడు కూడా ఏడ్వడం.. అది చూసి వారి కుటుంబ సభ్యులందరూ కంటతడి పెట్టడంతో జగన్‌తోపాటు అక్కడ ఉన్న అందరి కళ్లూ చెమ్మగిల్లాయి. తల్లీబిడ్డలను జగన్ ఓదార్చారు. ‘ఆత్మహత్యకు దారితీసిన కారణాలేమిటి? అప్పు ఎంత ఉంది? మాఫీ ఎంత అయ్యింది? ప్రభుత్వం నుంచి పరిహారం అందిందా?’ అని ఆమెను జగన్ అడిగారు. ‘అప్పుల బాధతో నా భర్త పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంకులోన్ రూ. 1.76 లక్షలు(మూడు వేర్వేరు బ్యాంకు అకౌంట్లలో) ఉంది. బంగారు రుణం రూ. లక్షకుపైగా ఉంది. బ్యాంకులోనుపై రూ. 40 వేలు మాత్రమే మాఫీ అయ్యింది.
బంగారుపై ఒక్క రూపాయి కూడా మాఫీ కాలేదు. భర్త చనిపోయి ఎనిమిది నెలలవుతోంది. అధికారులు సాయం అందిస్తామంటున్నారు కానీ.. ఇంత వరకు ఒక్క పైసా ఇవ్వలేదు.’ అని మాలతమ్మ వాపోయింది. ‘నేను వస్తున్నానని తెలిసే వాళ్లు ఆర్థిక సాయం ఇస్తామని చెబుతుంటారు తల్లీ.. తీరా నేను వెళ్లిపోయాక సమస్య మళ్లీ మొద టికొస్తుంది’ అని జగన్ అన్నారు. ఈ సందర్భంగా మృతుడి బంధువులు కూడా తమ సమస్యలు ఏకరువు పెట్టారు. చంద్రబాబు మాటలు నమ్మి.. తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో కష్టాలు పడుతున్నామని, తాకట్టు పెట్టిన బంగారు రుణాలు చెల్లించాలంటూ నోటీసులు వచ్చాయని వారు వివరించారు.
డ్వాక్రా రుణాలపై వడ్డీ మీద వడ్డీ వేశారని, చంద్రబాబు మమ్మల్ని ఇంత మోసం చేస్తారని ఊహించలేదని. వితంతు పింఛన్లు కూడా ఇవ్వకుండా తిప్పుకుంటున్నారని వారు తెలిపారు. ‘బాబు చేసిన నిర్వాకం వల్లే అందరిపైనా వడ్డీ భారం పడింది. మంచి రోజులు వస్తాయి తల్లీ.. అంతవరకు ఓపికపట్టండి. ఈ ప్రభుత్వం మీకు సాయం చేయకపోయినా మా ప్రభుత్వం వచ్చాక మీకు ఆర్థిక సాయం అందిస్తాం. పింఛన్లపై కోర్టులో కేసు వేసి మీకు న్యాయం జరిగేలా చూస్తా.’ అంటూ వారందరికీ జగన్ భరోసా ఇచ్చారు.
పరిహారం కోసం పోరాడదాం...
మంగళవారం ఉదయం అనంతపురంలోని ఆర్డీటీ అతిథి గృహం నుంచి యాత్రకు బయలుదేరిన జగన్ రాప్తాడు, చెన్నేకొత్తపల్లి మీదుగా వెంకటాంపల్లి గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు వన్నా వెంకట్రామిరెడ్డి నివాసానికెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించా రు. మృతుడి భార్య నాగలక్ష్మమ్మతో ఆత్మహత్యకు దారితీసిన కారణాలు అడిగి తెలుసుకున్నారు. ‘పొలం ఎంత ఉంది? ఎన్ని బోర్లు వేశారు? వాటిలో నీళ్లు ఉన్నాయా? బ్యాంకు రుణం ఎంతుంది? బంగారు రుణం ఎంత? వాటిపై రుణమాఫీ ఎంత అయ్యింది? ఇన్సూరెన్సు, ఇన్‌పుట్‌సబ్సిడీ వచ్చిందా? ప్రభుత్వ ఆర్థిక సాయం రూ. 5 లక్షలు ఇచ్చారా?’ అని ఆమెను జగన్ అడిగారు. ‘ఎనిమిది ఎకరాల పొలం ఉంది. ఐదు బోర్లు వేసి నా నీళ్లు పడలేదు. బ్యాంకు లోను రూ.70 వేలు ఉంది.
బంగారం లోను తీసుకోలేదు. డ్వాక్రా రుణం రూ. 30 వేలు ఉంది. బ్యాంకు లోనుకు గాను రూ. 14 వేలు మాత్రమే మాఫీ అయ్యింది. ఇన్సూరెన్సు, ఇన్‌ఫుట్ సబ్సిడీ ఏదీ రాలేదు. ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం అర్జీ పెట్టాం. అధికారులు వచ్చి విచారణ చేసి వెళ్లారు కానీ.. ఒక్క పైసా ఆర్థిక సాయం అందించలేదు. పింఛను కూడా ఇవ్వలేదు.’ అంటూ ఆమె వాపోయింది. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మీకు రూ. 5 లక్షల పరిహారం అందే లా చూస్తామని జగన్ ఆమెకు భరోసా ఇచ్చారు.