'సింగపూర్కెందుకు.. ఢిల్లీకి వెళ్లు' | ys jagan mohan reddy speech in yuvabheri | Sakshi
Sakshi News home page

'సింగపూర్కెందుకు.. ఢిల్లీకి వెళ్లు'

Published Wed, Jan 27 2016 1:34 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

'సింగపూర్కెందుకు.. ఢిల్లీకి వెళ్లు' - Sakshi

'సింగపూర్కెందుకు.. ఢిల్లీకి వెళ్లు'

కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో కీలకమైన ప్రత్యేక హోదా సాధించే విషయంలో అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ విషయంలో చేతులెత్తేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును గట్టిగా నిలదీయాలన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడిన ప్రత్యేక హోదా కోసం ఢిల్లీపై చంద్రబాబు ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు.

ప్రత్యేక హోదాపై బుధవారం కాకినాడలోని అంబేద్కర్ భవన్ లో జరిగిన యువభేరీ కార్యక్రమంలో జగన్ మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతను, దాని వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరిస్తూ దాన్ని సాధించడానికి అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదు. ఎందుకు ఒత్తిడి చేయడం లేదు. ఇవేవీ చేయకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన విచ్చలవిడి అవినీతి లావాదేవీల నుంచి బయటపడటానికి కేంద్రం ముందు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతి జిల్లా హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక సాధించుకోగలిగితే రాష్ట్రంలోని ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ గా మారుతుందని జగన్ వివరించారు. ఎంతో ఉన్నత చదువులు చదువుకున్న యవతీ యువకులు ఉద్యోగం, ఉపాధి కావాలంటే అంతా హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. ఎందుకంటే 70 శాతం పరిశ్రమలు హైదరాబాద్ చుట్టుపక్కలే ఉన్నాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగం కావాలంటే అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. అదే కనుక ప్రత్యేక హోదా మనం సాధించుకోగలిగితే ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుంది.

నాటి మాటలు మరిచిపోయారా బాబూ
రాష్ట్రం విభజన సందర్భంగా ఇలాంటి హైదరాబాద్ ను దూరం చేస్తున్నందుకు జరుగుతున్న నష్టాన్ని పూడ్చడానికి పార్లమెంట్ సాక్షిగా కొన్ని హామీలిచ్చారు. ప్రధానమంత్రి, అప్పటి ప్రతిపక్ష పార్టీలు మద్దతునిచ్చాయి. ఏపీకి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రధానమంత్రి చెబితే ఐదేళ్లు సరిపోవు... పదేళ్లు ఇవ్వాలని బీజేపీ నేతలు, టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. విభజన చట్టంలో అనేక హామీలిచ్చారు. ఆ రకంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీతో రాష్ట్రాన్ని విడగొట్టారు.

ఆ పేరుతోనే ఎన్నికలకు వెళ్లారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు తాము అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా సాధించగలమంటూ ఊరూరా ప్రచారం చేశారు. ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేశారు. పెద్దపెద్ద పోస్టర్లు వేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా పేర్కొన్నారు. విభజన చట్టంలో  ఇచ్చిన హామీలన్నింటినీ కూర్చి ఇప్పుడేదో ప్యాకేజీ అంటూ మభ్యపెడుతున్నారు. విభజన చట్టంలో పోలవరం జాతీయ ప్రాజెక్టుగా చేపడుతామనీ, విజయవాడ, విశాఖ మెట్రో రైలు ఇస్తామని, కాలేజీలు, యూనివర్సిటీలు ఇస్తామంటూ ఎన్నో హామీలిచ్చారని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తిరుపతిలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో మోదీతో కలిసి ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఉదరగొట్టారు. ఇప్పుడేమో ప్యాకేజీ అంటూ మభ్యపెడుతున్నారంటూ జగన్ మండిపడ్డారు.

సింగపూర్ ఎందుకు బాబూ
ప్రత్యేక హోదా కల్పించడం వల్ల రాష్ట్రానికి లభించే ప్రయోజనాలను ఈ యువభేరీలో జగన్ మోహన్ రెడ్డి సమగ్రంగా వివరించారు. కేంద్రం నుంచి లభించే నిధుల్లో 90 శాతం గ్రాంటుగా లభిస్తుంది. అదే ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకైతే కేంద్రం ఇచ్చే నిధుల్లో 30 శాతం మాత్రమే గ్రాంటుగా,  మిగతా 70 శాతం రుణంగా లభిస్తుంది. ప్రత్యేక హోదా కల్పిస్తే పరిశ్రమలకు అనేక రాయితీలు వర్తిస్తాయి. తద్వారా రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి పారిశ్రామికవేత్తలు క్యూ కడతారు. ఆదాయపు పన్నులో రాయితీతో పాటు పరిశ్రమలకు అవసరమైన యంత్రాలపై ౩౩ శాతం రాయితీ లభిస్తుంది. రవాణా ఖర్చులతో పాటు,  పరిశ్రమలకు వచ్చే 20 ఏళ్ల పాటు 50 శాతం మేరకు విద్యుత్ రాయితీలు లభిస్తాయి. పరిశ్రమలు వచ్చినప్పుడే యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

ఇవన్నీ సాధించుకోవాలంటే ఢిల్లీ వెళ్లి కేంద్రంపై పోరాటం చేయాలే గానీ సింగపూర్ వెళ్లడమేంటని జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. చంద్రబాబు సింగపూర్, మలేషియా, దావోస్ వెళ్లాల్సిన అవసరం లేదు. ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిపై ఒత్తిడి తెచ్చి సాధించుకోవాలి. ప్రత్యేక హోదా సాధిస్తే మనం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. అంతా మన రాష్ట్రానికి క్యూ కడతారు. అయితే ఇంత కీలకమైన ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కల్పించడం వల్ల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏ విధంగా పారిశ్రామిక అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని ఈ సందర్భంగా జగన్ ఉదహరించారు.

అడ్డుపడిందెవరు
ప్రత్యేక హోదా కల్పించే విషయంలో రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. ఆర్థిక సంఘం సిఫారసులు అంటూ దాన్నేదో సాకుగా చూపిస్తూ ప్రత్యేక హోదా అంశంపై మభ్యపెడుతున్నారు. నిజానికి ప్రత్యేక హోదాకు ఆర్థిక సంఘానికి ఎలాంటి సంబంధం లేదు. మేం ఈ తరం వాళ్లం. అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతే మాట్లాడుతున్నాం. మిమ్మల్ని నిలదీస్తున్నాం. ప్రశ్నిస్తున్నాం. ప్రత్యేక హోదా ఇచ్చే అంశం ఆర్థిక సంఘానికి ఏమాత్రం సంబంధం లేదు. ఆ అధికారం కూడా ఆ సంఘానికి లేదు. రెవెన్యూను రాష్ట్రాలకు ఏ విధంగా పంపిణీ చేయాలి. ప్రణాళికేతర గ్రాంట్ల పంపిణీ వంటి వాటిని మాత్రమే పర్యవేక్షిస్తుంది.

గతంలో పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర విభజన చట్టం ఆమోదించిన తర్వాత అప్పట్లో జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం కూడా తీర్మానం చేసింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని ప్లానింగ్ కమిషన్ ను ఆదేశించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్లానింగ్ కమిషన్ ను రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ తీసుకొచ్చారు. అయితే నీతి ఆయోగ్ తీసుకొచ్చేంతవరకు దాదాపు 8 నెలల పాటు పెండింగ్ లో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కసారి అయినా అక్కడ పెండింగ్ లో ఉన్న విషయాన్ని ఎందుకు కేంద్రం వద్ద నిలదీయలేదని, ఎందుకు సాధించలేదని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన జాతీయాభివృద్ధి మండలి చైర్మన్ గా ప్రధానమంత్రి ఉన్నారు. ప్లానింగ్ కమిషన్ చైర్మన్ గా, నీతి ఆయోగ్ చైర్మన్ గా అన్నింటికీ ప్రధానమంత్రే ఉన్నప్పుడు ప్రత్యేక హోదా ఫైలుపై సంతకం పెడితే ఆపేదెవరు. ఇదే విషయాన్ని చంద్రబాబు ఎందుకు నిలదీయరు.

ఇస్తే మాత్రం అంతా నేనే
వాస్తవాలన్నీ ఇలా ఉన్నప్పటికీ వనరులు తక్కువగా ఉన్నాయని, ఇతరత్రా ప్రయోజనాలు చేకూర్చుతామంటూ రకరకాలుగా మభ్యపెడుతున్నారు. అబద్దాలు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారు. ప్రత్యేక హోదా కలిగిన జమ్ము కాశ్మీర్ వెళ్లిన సందర్భంగా ఆ రాష్ట్రానికి ఏ కంగా 70 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు. అదే 5 కోట్లకు పైగా జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తే ఎన్ని వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటుందో ఆలోచించాలి. ఈ విషయంలో చంద్రబాబు మౌనం వీడి కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వదని అందుకు అనుగుణంగానే చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా అనేది వేస్ట్ అంటున్నారు. అదే ప్రత్యేక హోదా ఇస్తామని ఒకవేళ కేంద్రం చెబితే చంద్రబాబు వెంటనే తన వల్లే వచ్చిందని చెప్పుకోవడానికి ఏ రకంగా వ్యవహరిస్తారో యువభేరీలో వివరించినప్పుడు సమావేశ మందిరం చప్పట్లతో మారుమోగింది.

ఇటీవలి కాలంలో విశాఖలో సీఐఐ సమావేశం నిర్వహిస్తే ఎలా హడావిడి చేశారో గుర్తుచేస్తూ అదే రకంగా విశాఖలో ఒక ప్రత్యేక కార్యక్రమం పెట్టి ఎంతో మందిని పిలిచి వారికి ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి హడావిడి చేసేవారు. కనీసంగా 1600 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి మరీ ఆర్భాటం చేసేవారు. తాను కష్టపడితే... ఎంతో శ్రమపడితే ప్రత్యేక హోదా వచ్చిందని చెప్పేవారు. అలా జరగడం లేనందున ఇప్పుడు అసలు ప్రత్యేక హోదాపై పోరాటం ఎందుకు దండగ అని మాట్లాడుతున్నారు. మీ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడం ఎంతవరకు ధర్మం అని జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఒక్క జగన్ వల్ల సాధ్యం కాదని, అందరూ ఒక్కటై పోరాడితే సాధించుకోగలుగుతామన్నారు.

బాబు అడక్కపోవడానికి కారణమేమంటే...
ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు అడక్కపోవడానికి ఆయన విచ్చలవిడి అవినీతి వ్యవహారాలేనని జగన్ దుయ్యబట్టారు. ఏపీలో పోలవరం నుంచి పట్టిసీమ, ఇసుక నుంచి బొగ్గు వరకు, మద్యం లైసెన్సులు... అన్నింటా లంచాలు దండుకుంటున్నారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. ఈ లంచాలతో వచ్చిన డబ్బుతో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కోట్లాది రూపాయలు ఎరవేశారు. 8 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఒక్కొక్కరికి 5 నుంచి 20 కోట్ల రూపాయలు ఎరగా చూపిన ఘటనలో అడ్డంగా పట్టుబడిన చంద్రబాబు నాయుడు ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే కేంద్రం నుంచి వైదొలగుతామని ఒక నెల రోజుల గడువు పెట్టి ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారని మండిపడ్డారు.

ఏదీ నిరుద్యోగులకు భరోసా
రాష్ట్ర ప్రభుత్వం 20 నెలలు దాటినా ఇప్పటివరకూ ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఏపీపీఎస్సీ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. బాబు అధికారంలోకి వస్తే జాబు వస్తుందని ఊదరగొట్టారని...ఇప్పటి పరిస్థితి చూస్తే ఆయన అధికారంలోకి రాగానే ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టుపెట్టారని, హోదా గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీయాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. యువభేరీలో పాల్గొనడానికి వస్తుంటే దారిలో కొందరు తనను కలిసి తమ బాధలను మొరపెట్టుకున్నారు. ఎలాంటి కారణం లేకుండా ఆరోగ్య మిత్ర ఉద్యోగులను నిర్ధాక్షణ్యంగా తొలగించారు. ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు ఎలా కత్తిరించాలా అని ప్రభుత్వం దిక్కుమాలిన ఆలోచన చేస్తోంది. పీహెచ్డీలు చదివినవారు కూడా పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను చొక్కా పట్టుకుని నిలదీయాలి
ఎన్నికలప్పుడు ఇచ్చిన మాట మరచిపోయారు. ప్రజలతో పని ఏమున్నట్లు వ్యవహరిస్తున్నారు. రోజుకో మాటతో మభ్యపెడుతున్నారు. ప్యాకేజీ పేరు చెబితే చంద్రబాబును చొక్కాపట్టుకొని నిలదీయండి. మభ్యపెట్టడం న్యాయమేనా అని చంద్రబాబును ప్రశ్నించండి. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారా లేదా అని కేంద్రానికి వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి లేఖ రాశారు.
ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశం లేదని స్పష్టంగా లేఖలో కేంద్రం పేర్కొంది. మీ ముందుకు వచ్చే కేంద్ర, రాష్ట్ర మంత్రులను, చంద్రబాబును ప్రశ్నించండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement