సంతోషం మా సొంతం: షర్మిల
నిజామాబాద్: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తనయ, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల అన్నారు. పావురాలగుట్టలో జగనన్న ఇచ్చిన మాటను మడమ తిప్పకుండా నిలబెట్టుకున్నామని చెప్పారు. తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ చిరస్థాయిగా నిలిచివుంటారని అన్నారు. నిజామాబాద్ జిల్లాలో పరామర్శయాత్ర ముగిసిన తర్వాత శుక్రవారం మధ్యాహ్నం గాంధారి పోతంగల్ కలాన్ గ్రామంలో ఆమె విలేకరులతో మాట్లాడారు.
ఆమె ఏమన్నారంటే...
- 2009లో సెప్టెంబర్ 2న ప్రజల సమస్యలను పరిష్కరించానికి రచ్చబండకు వెళుతూ తాను ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యమై మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించారు.
- మహానేత మరణాన్ని జీర్ణించుకోలేక 750 మంది ఆయన వెనకాలే మృతి చెందారు
- ఈ రోజు వరకు ప్రజాస్వామ్య చరిత్రలో ఒక నాయకుడు చనిపోతే ఇలా వందల గుండెలు ఆగిపోవడం ఎప్పుడూ జరగలేదు
- దీన్ని బట్టే వైఎస్ఆర్ ఎంతటి గొప్ప ప్రజానాయకుడో, ఎంత మంచి వ్యక్తో అర్థవవుతోంది
- తండ్రి బిడ్డల అవసరాలు తీర్చినట్టుగా ప్రజలు అవసరాలు తీర్చి ముఖ్యమంత్రి పదవికి గొప్ప అర్థం చెప్పారు
- కుల, మత, ప్రాంత, వర్గ భేదం లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేశారు
- మన, పర తేడా లేకుండా ప్రతిఒక్క వర్గానికి మేలు చేశాడు
- 23 జిల్లాల ప్రజల గుండెల్లో మహానేత ఎప్పటికీ చిరంజీవిగానే ఉంటారు
- ఉచిత్ విద్యుత్ పండించే పంటలో, పేదలకు సంజీవనిగా మారిన ఆరోగ్యశ్రీలో, జలయజ్ఞంతో సాగులోకి తెచ్చిన 25 లక్షల పంట భూముల్లో ఇలా చెప్పుకుంటూ ఎన్నో పథకాల్లో వైఎస్ఆర్ జీవించే వుంటారు
- వైఎస్ఆర్ చనిపోయి ఆరేళ్లు అయినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలోనూ ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కొనసాగడం మహానేత గొప్పతనానికి నిదర్శనం
- మహానేత మరణం తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తానని పావురాలగుట్టలో జగనన్న మాట ఇచ్చారు
- కొడుకు హోదాలో జగనన్న ఇచ్చిన మాటకు కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ రంగు పూసింది
- టీడీపీతో కలిసి జగనన్న మీద కేసులు పెట్టి, కష్టాలపాల్జేసింది.
- ఎన్ని కష్టాలు ఎదురైనా జగనన్న సంకల్పం చెక్కు చెదరలేదు
- పావురాలగుట్టలో జగనన్న ఇచ్చిన మడమ తిప్పకుండా మాటను నిలబెట్టుకున్నాం
- ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్న సంతోషం ఇప్పుడు మా సొంతం
- అందరినీ కలిసి పరామర్శించాం. వారి అభిమానాన్ని గుర్తించాం, ధన్యవాదాలు తెలుపుకున్నాం
- ఓదార్పుయాత్ర, పరామర్శయాత్ర విజయవంతమవడానికి సహకరించిన వైఎస్ఆర్ సీపీ శ్రేణులకు ధన్యవాదాలు
- గాంధారి పోతంగల్ కలాన్ వద్ద పైలాన్ పెట్టాలని నిర్ణయించాం. ఇదొక దీవెన ఉండాలన్నది మా కోరిక