రాజన్నకు మరణం లేదు | ys sharmila paramarsha yatra in warangal | Sakshi
Sakshi News home page

రాజన్నకు మరణం లేదు

Published Wed, Aug 26 2015 3:00 AM | Last Updated on Tue, May 29 2018 6:04 PM

రాజన్నకు మరణం లేదు - Sakshi

రాజన్నకు మరణం లేదు

పరామర్శ యాత్రలో షర్మిల
సాక్షి, ప్రతినిధి, వరంగల్: ప్రాంతాలకు అతీతంగా, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన వైఎస్ రాజశేఖరరెడ్డికి మరణంలేదని ఆయన కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ‘‘ముఖ్యమంత్రిగా ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకున్న వైఎస్ ఇప్పటికీ కోట్ల మంది ప్రజల గుండెల్లో బతికే ఉన్నారు. తెలుగుజాతి ఉన్నంతకాలం వారి మనసుల్లో జీవించే ఉంటారు’’ అని పేర్కొన్నారు.

పరామర్శ యాత్రలో భాగంగా వరంగల్ జిల్లాలో రెండో రోజు మంగళవారం జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమె పర్యటించారు. తాటికొండలో తనకు ఆత్మీయస్వాగతం పలికిన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘ప్రజల కోసం వైఎస్ ఏం చేశారో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నాయకుడికి మనసుంటే, ఆ మనసుతో ప్రేమిస్తే ఆ పాలన ఎంత అద్భుతంగా ఉంటుందో రాజన్న మనందరికీ చూపించారు.

పేదలను భుజాన మోశారు. రైతును రాజును చేశారు. మహిళలను లక్షాధికారులను చేశారు. తన హయాం లోదేశమంతటా కలిపి 46 లక్షల ఇళ్లు నిర్మిస్తే ఒక్క మన రాష్ట్రంలోనే 46 లక్షల ఇళ్లను నిర్మించి ఇచ్చారాయన! ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేద పిల్లలకు పెద్ద చదువులు చదివించారు. పేదలకు కార్పొరేట్ వైద్యమందించేందుకు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యానికి 104 సేవలు తెచ్చారు. అభయహస్తం, పావలావడ్డీ పథకాలతో మహిళలకు అండగా నిలిచారు.

ఉచిత విద్యుత్, రుణమాఫీతో రైతులకు భరోసా కల్పించారు. నాయకుడంటే ఇలా ఉండాలని వైఎస్ చూపించారు. ఆయన్ను మీరంతా గుండెల్లో పెట్టుకున్నారు గనకే నేడిక్కడికి వచ్చారు. వైఎస్‌పై అభిమానంతో ఇక్కడికొచ్చిన ప్రతి అవ్వకు, అయ్యకు, అక్కకు, చెల్లెకు, అన్నకు తమ్ముళ్లకు చేతులు జోడించి, శిరసు వంచి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా. అనుక్షణం ప్రజల సంక్షేమం కోసం తపించారు వైఎస్. తెలుగు ప్రజలను ప్రాంతాలకతీతంగా సొంత బిడ్డల్లా చూసుకున్న వైఎస్ ఆశయాలను బతికించుకుందాం. అందుకు అందరం చేయీ చేయీ కలుపుదాం. రాజన్న రాజ్యాన్ని మళ్లీ తెచ్చుకుందాం’’ అంటూ పిలుపునిచ్చారు.
 
78 కిలోమీటర్లు పర్యటన
మంగళవారం షర్మిల వరంగల్ జిల్లాలో 78 కిలోమీటర్లు పర్యటించి ఏడు కుటుంబాలను పరామర్శించారు. జనగామ నియోజకవర్గం బచ్చన్నపేటలోని గుడిసెల లచ్చవ్వ, అలువాల యాదగిరి కుటుంబాలకు భరోసా ఇచ్చారు. పోచన్నపేటలో నేలపోగుల యాదగిరి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నమిలిగొండలో గాదె శంకర్ కుటుంబాన్ని పరామర్శించారు. తర్వాత స్టేషన్‌ఘన్‌పూర్‌లో వల్లాల లక్ష్మయ్య, తాటికొండలో ఎడమ మల్లయ్య, కిష్టాజిగూడెంలో జక్కుల కొమురయ్య కుటుంబాలను పరామర్శించారు.

అండగా ఉంటామంటూ ధైర్యం చెప్పారు. బుధవారం స్టేషన్‌ఘన్‌పూర్, వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శించనున్నారు. వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలో సాగుతున్న పరామర్శ యాత్రలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యద ర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్‌రావు, ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు బీష్వ రవీందర్, వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు విలియం మునిగాల, నాడెం శాంతికుమార్, జి.సూర్యనారాయణరెడ్డి, జి.రాంభూపాల్‌రెడ్డి, జి.శివకుమార్, జి.జైపాల్‌రెడ్డి, షర్మిల సంపత్, వి.శంకరాచారి, ఎం.కల్యాణ్‌రాజ్, ఎ.మహిపాల్‌రెడ్డి, ఎ.కిషన్, డి.కిశోర్‌కుమార్, ఎన్.నర్సింహారెడ్డి, ఎల్.జశ్వంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
అంతా వైఎస్‌నే గుర్తు చేస్తున్నారు: పొంగులేటి

సాక్షి, హన్మకొండ: ప్రజల మనసు తెలుసుకుని పాలించిన జన నాయకుడు వైఎస్ అని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో ప్రస్తుత పాలనకు, వైఎస్సార్ పాలనకు పొంతన లేదన్నారు. వైఎస్సార్ కలలను నెరవేర్చేందుకు అందరం కలిసి కష్టపడదామని పిలుపునిచ్చారు.

షర్మిల పరామర్శ యాత్రలో భాగంగా మంగళవారం స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘ముఖ్యమంత్రిగా వైఎస్ పాలన ఎలా సాగిందోనాకంటే, షర్మిల కంటే మీ ఊరిలోని ఎడమ మల్లయ్య కుటుంబసభ్యులే బాగా చెప్పారు. వైఎస్ చేసిన అభివృద్ధి, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి రాష్ట్రంలో ఏ ఇంటి తలుపు తట్టినా చెబుతారు.

అందుకే ఆయన మరణించి ఆరేళ్లవుతున్నా ప్రజలంతా ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా, అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిన నాయకుడు వైఎస్. ప్రజల అవసరాలను తెలుసుకుని వారడిగినవి, అడగనవి అన్నీ అందేలా పాలించారు. తర్వాత వచ్చిన పాలకులు ఆయన పథకాలను తుంగలో తొక్కారు’’ అని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement