వైఎస్ ముద్రను చెరపగలరా!
ఏలరు (ఆర్‌ఆర్ పేట) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించినంత మాత్రాన ప్రజల గుండెల్లోంచి ఆయన ముద్రను చెరపలేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని అన్నారు. విజయవాడలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొలగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి స్వర్ణయుగాన్ని చూపిన మహానేతవైఎస్ రాజశేఖరరెడ్డి తీపి గుర్తులను ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని ఆయన పేర్కొన్నారు. అడిగిన వారికి, అడగని వారికి కూడా అనేక సంక్షేమ పథకాలు అమలుచేసి ప్రజల హృదయాల్లో ఆయన చిరస్మరణీయ ముద్ర వేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ ముద్రను ప్రజల హృదయాల నుంచి వేరు చేయడం సాధ్యం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దారుణాల మీద దారుణాలు చేస్తోందని, ఇప్పటికే ఆలయాలను కూల్చి మహాపాతకానికి ఒడిగట్టిన ప్రభుత్వం ఇప్పుడు మహా నాయకుల విగ్రహాల కూల్చివేస్తుండటం దురదృష్టకరమని నాని ధ్వజమెత్తారు. ప్రజల మనిషిగా కీర్తింపబడిన నాయకుడి విగ్రహాన్ని తొలగించడం ప్రభుత్వ దుశ్చర్య అని, ప్రజల నుండి వెల్లువెత్తే ప్రభుత్వ వ్యతిరేక ఉప్పెనలో ఈ పాలకులు కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. ప్రభుత్వం ఇటువంటి విధానాలన్నింటికీ సమాధానం చెప్పాల్సిన సమయం త్వరలోనే వస్తుందన్నారు.
స్ఫూర్తిప్రదాతకు అవమానం : పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి
మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశవిదేశాలకు చెందిన ఎందరో నాయకులకు స్ఫూర్తిగా నిలిచాయని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి అన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు అటువంటి మహానేత విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గమన్నారు. ప్రజాభిమానాన్ని పొందిన అతికొద్దిమంది నాయకుల్లో ఒకరైన గొప్ప నాయకుడికి జరిగిన అవమానం తమకు జరిగినట్టుగా ప్రజలు భావిస్తున్నారని, ప్రభుత్వం చేసిన తప్పును వెంటనే సరిదిద్దుకుని విగ్రహాన్ని పునః ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.