సర్కార్‌కు చిత్తశుద్ధిఉందా..! | YSR Congress slams TRS Government on project re- designing | Sakshi
Sakshi News home page

సర్కార్‌కు చిత్తశుద్ధిఉందా..!

Published Mon, Jul 25 2016 7:57 PM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

YSR Congress  slams TRS Government on project re- designing

 రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మల్లన్నసాగర్ ప్రాజెక్టు రీ డిజైన్‌పై సీఎం కే సీఆర్ ఆధ్వర్యంలో అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేసి ఆయా అంశాలపై చర్చించాలని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు డా. గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్‌చేశారు. ఈ ప్రాజెక్టుపై అఖిలపక్షంతో చర్చించకుండా, గ్రామసభలు పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా రాత్రికి రాత్రి డి జైన్లు మార్చడం, జీవోలు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.

 

నిర్వాసితులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జీ చేయడాన్ని, రైతులకు మద్దతునిస్తున్న వైఎస్సార్‌సీపీతో సహా ఇతరపార్టీల నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు. మళ్లీ ఇటువంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. లాఠీలు, తూటాలతో పొలాల్లోకి నీళ్లు రావన్న విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలని హితవుపలికారు. రైతులు కోరుకున్న విధంగా కేంద్ర భూసేకరణ చట్టం, 2013 లేదా జీవో 123 ప్రకారం పరిహారమిస్తామని సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు ప్రకటించి అందుకు భిన్నంగా వ్యవహరించడ ఏమిటని నిలదీశారు. తమ పార్టీ ప్రాజెక్టులకు పూర్తి మద్దతునిస్తుందని, అయితే నిర్వాసితులకు అన్ని ప్రయోజనాలు చేకూర్చి, రైతుల కుటుంబాలకు ఉద్యోగాలిచ్చి, ఉపాధి కోల్పోయిన వారికి పనులు కల్పించి, ఇళ్లు, ఆర్‌ఓఆర్ ప్యాకేజీని నిర్ణీత కాలవ్యవధితో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు.

 

సోమవారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలను పెట్టి రైతుల భూములను రిజిష్టర్ చేయించడాన్ని తప్పుబట్టారు. రైతుకు ఉపాధినిచ్చేది అతని పొలమేనని, దానిని లాక్కుంటూ తగిన పరిహారం అందించకపోవడం ఏమి న్యాయమని ప్రశ్నించారు. భూమిని తీసుకునే విషయంలో రైతులను సంతృప్తిపరిచే ప్రయత్నం ఎందుకు చేయడం లేదని, గ్రామస్థాయికి ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. జలయజ్ఞానికి సంబంధించి మహానేత డా. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తీసుకున్న చర్యల ఫలితాలు ఇప్పుడు వస్తున్నాయన్నారు. వైఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగానే ఇప్పుడు మహబూబ్‌నగర్‌జిల్లాలోని ప్రాజెక్టుల నుంచి నీళ్లు వస్తున్నాయన్నారు. రైతన్నల కడుపుకొట్టిన ప్రభుత్వాలు ఏవి మనలేదన్న విషయాన్ని గ్రహించాలని, వారి ఉసురు తగులుతుందని హెచ్చరించారు.

 

గతంలో చంద్రబాబు ప్రభుత్వం బషీర్‌బాగ్‌లో కాల్పులకు పాల్పడితే ఏమైందో గుర్తుంచుకోవాలని, లాఠీచార్జీలకు పాల్పడి తూటాలు పేల్చితే ప్రభుత్వ పతనం ప్రారంభమవుతుందనే విషయాన్ని గుర్తెరగాలన్నారు. నిర్వాసితులను బలవంతంగా వెళ్లగొట్టే చర్యలను మానుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించి ఆరునెలల ఆలస్యంగా ప్రాజెక్టును ప్రారంభించినా ఏమీ కాదని హితవుపలికారు. సీఎం సొంతజిల్లా మెదక్‌లోనే 600 మంది రైతులు ఆత్మహత్యల బారిన పడితే వారిలో కనీసం 60 మందికి కూడా పరిహారం అందించకపోవడం సిగ్గుచేటని గట్టు శ్రీకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement