మరీ ఇంత రాక్షసత్వమా...!
మరీ ఇంత రాక్షసత్వమా...!
Published Tue, Jul 11 2017 3:35 AM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM
- పోలీసులు వేధింపులు తాళలేక వైఎస్సార్ సీపీ కార్యకర్త ఆత్మహత్య
- రౌడీ షీటర్ నెపంతో అధికార పార్టీ అండ, దండలతోనే అఘాయిత్యం
- ఎమ్మెల్యేపై కేసు నమోదుకు ఆందోళనకు దిగిన నేతలు, కార్యకర్తలు
- ఏడుగంటలపాటు మృత దేహంతో ధర్నా
- ఉద్రిక్తంగా మారిన పరిస్థితి ... పోలీసుల మోహరింపు
- చర్చలు అనంతరం ఫిర్యాదుల స్వీకరణతో ఆందోళన విరమణ.
శహపురం (పెదపూడి): మండలంలోని శహపురంలో వృద్ధుడి ఆత్మహత్య తీవ్ర ఉద్రిక్తలకు దారితీసింది. దీంతో ఎమ్మెల్యే కేసు నమోదు చేయాలని, ఎస్సైను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ స్థానికులతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ సత్తి సర్యనారాయణలు రెడ్డిలు ఆందోళనలో పాల్గొనడంతో పోలీసులు దిగిరాక తప్పలేదు. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ మండల కన్వీనర్ గాజంగి వెంకటరమణ మేనమామ రాయుడు సత్యనారాయణ (64) సోమవారం ఆడదాని రేవు వంతెనపై నుంచి కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈయనకు లోవరాజు, మురళీకృష్ణ ఇద్దరు కొడుకులున్నారు. గాజంగి వెంకటరమణ వారికి మేనమామ కావడంతో గ్రామంలో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అయితే గత రెండున్నరేళ్ల కిందట ఈ కుటుంబంలోని పురుషలందరిపై అధికార తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు లోవరాజు, మురళీ, తండ్రి సత్యనారాయణపై పోలీసులు రౌడీ షీట్‌ను నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పెదపూడి పోలీస్టేషన్‌కు కొత్తగా ఎస్‌ఐ కె.కిశోర్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. ప్రతి ఆదివారం మండలంలోని రౌడి షీట్‌లో ఉన్న వారందరూ స్టేషన్‌కు హాజరు కావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 9న ఉదయం అందరితోపాటు మృతుడు సత్యనారాయణ కూడా పోలీస్టేషన్‌కు వెళ్లాల్సి ఉండగా పక్షవాతానికి గురై వెళ్లలేదు. ఇదే విషయాన్ని పోలీసులకు తెలియజేసినా రావల్పిందేనని పట్టుబట్టడంతో ఆటోలో తీసుకుని వెళ్లడంతో మనస్థాపానికి గురై ఆడదాని రేవు వంతెన వరకు నడుచుకుంటూ వచ్చి ... రెయిలింగ్‌పైకి ఎక్కి కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడడ్డాడు. విషయం తెలిసిన కుమారులు పరుగున వచ్చి కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఎట్టకేలకు వంతెనకు వంద మీటర్ల దూరంలో నాలుగు గంటలకు మృతదేహం లభ్యమైంది.
ఉద్రిక్తంగా మారిన సత్యనారాయణ ఆత్మహత్య సంఘటన...
సత్యనారాయణ ఆత్మహత్య సంఘటనతో మండలవ్యాప్తంగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నారన్న ఆగ్రహంతో మృతదేహాన్ని తీసుకుని పెదపూడి పోలీస్‌స్షేషన్ వద్ద ఆందోళన చేయడానికి బయలుదేరగా పోలీసులు భారీ ఎత్తున మోహరించి అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న అనపర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి పార్టీ శ్రేణులతో పోలీసులు మృతదేహాన్ని అడ్డుకున్న ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడిక్కింది. సుమారు 20 నిమిషాలపాటు పోలీసులు నిర్బంధించడంతో మృతదేహాన్ని చేతులపైనే మోసి సుమారు రెండు కిలోమీటర్ల దూరం తీసుకువచ్చారు. నియోజకవర్గవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు, అధికార పార్టీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సత్యనారాయణ మృతికి కారణమైన స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణరెడ్డిని మొదటి ముద్దాయిగా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ అండదండలతో హింసకు గురి చేసిన ఎస్సై కిశోర్‌బాబును సస్పెండ్ చేయాలని నిలదీశారు.
అక్రమంగా రౌడీషీట్లు తెరచి వేధింపులకు పాల్పడడం దారుణం
రాష్ట్రంలో పోలీసులు అధికారపక్షానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 64 ఏళ్ళ వృద్ధుడిపై రౌడీషీట్ తెరచిన ఘనత పెదపూడి పోలీసులకే దక్కుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా అక్రమ రౌడీషీట్‌లు ఉన్నప్పటికీ అనపర్తి నియోజకవర్గంలో దాని మోతాదు మించుతోందన్నారు. మృతుడిది ఆత్మహత్య కాదని ముమ్మాటికి అ«ధికార తెలుగుదేశం పార్టీ చేయించిన హత్యేనని ఆరోపించారు.
పచ్చ చొక్కాల నాయకుల్లా పోలీసులు వ్యవహరిస్తున్నారు...
నియోజకవర్గంలో కొంతమంది పోలీసులు పచ్చ చొక్కాలు తొడిగిన టీడీపీ నాయకుల్లా వ్యవహరిస్తున్నారని నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సత్యనారాయణకు పక్షవాతం వచ్చి ఇబ్బంది పడుతున్నా స్టేషన్‌కు పిలిపించి అవమానించడం దారుణమన్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 10.30 గంటల వరకు సీఐలు పవన్ కిశోర్, చైతన్య కృష్ణలు కన్నబాబు, సూర్యనారాయణరెడ్డిలతో చర్చలు జరిపారు. అనంతరం బంధువులు ఎమ్మెల్యే, ఎస్సైల పై చేసిన ఫిర్యాదులను స్వీకరించడంతో ఆందోళనకారులు శాంతించారు. అనంతరం మృతదేహాన్ని కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Advertisement