కరువు సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం
- ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా వెంటనే ఇవ్వాలి
- వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ డిమాండ్
- సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
సోమందేపల్లి : ‘రాష్ట్రంలో 1965 తర్వాత అంతటి పెద్దకరువు ఈ ఏడాది వచ్చింది. కనిష్ట వర్షపాతం నమోదు కావడంతో పంటలన్నీ దెబ్బతిన్నాయి. రైతాంగం కుదేలయ్యే పరిస్థితులు దాపురించాయి. కరువు సహాయక చర్యలు చేపట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం దారుణంగా విఫలమైంద’ని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ విమర్శించారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా అందించాలని డిమాండ్ చేస్తూ గురువారం సోమందేపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన రైతుధర్నాలో ఆయన మాట్లాడారు. గత ఏడాది జిల్లాలో రూ.4 వేల కోట్ల పంట పెట్టుబడులను రైతులు నష్టపోయారన్నారు. బీమా రూ.450 కోట్లు మాత్రమే మంజూరైందని, అది కూడా రైతులకు సకాలంలో ఇవ్వడం లేదని తెలిపారు.
గత ఖరీఫ్‌లో జిల్లాలో వేరుశనగను కాపాడతామని రెయిన్‌గన్ల కోసం రూ.160 కోట్లు ఖర్చు చేసిన పాలకులు.. కనీసం ఎకరా కూడా కాపాడలేకపోయారని విమర్శించారు. ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమాలో అర్హులైన రైతులకు అన్యాయం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. పంటలు లేక, ఉపాధి భారమై జిల్లా రైతులు కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి భిక్షాటన చేస్తున్నారని, ఈ దుస్థితి బాబు పాలనలోనే వచ్చిందని అన్నారు. ఎన్నికల ముందు రుణమాఫీ అని మభ్యపెట్టిన చంద్రబాబు జిల్లా రైతులను నిలువునా ముంచారన్నారు. పది లక్షల రైతు ఖాతాలు ఉంటే రెండు లక్షల మందికి కూడా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయలేదన్నారు. తాగుబోతు, తిరుగుబోతులను జన్మభూమి కమిటీలలో నియమించి వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు రాకుండా చేశారన్నారు.
టీడీపీ నేతలు ఇసుక, మట్టిని అక్రమంగా కర్ణాటకకు తరలించి కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించుకుంటున్నారని విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు కాంట్రాక్ట్ పనులు, కమీషన్లపై ఉన్న మక్కువ ప్రజా సమస్యలపై లేకుండా పోయిందన్నారు. అన్ని వర్గాల ప్రజలు విసుగెత్తిపోయారని, ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు వెంకటరత్నం, శ్రీకాంత్‌రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, సర్పంచ్‌లు నారాయణరెడ్డి, సుధాకర్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.