
ప్రజాధనమంతా ప్రచారానికే
- రైతుల గోడు ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు
- జేబులు నింపుకోడానికే అధికార పార్టీ నేతల తాపత్రయం
- వైఎస్సార్‌సీపీ నేతల ధ్వజం
రాయదుర్గం : ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, వాటి నుండి ప్రజల దృష్టి మరల్చే విధంగా ప్రజలకు ఉపయోగం లేని కార్యక్రమాలు చేస్తూ ప్రజాధనాన్ని ప్రచారాలకు తగులబెడుతున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు అధికార పార్టీ నేతలపై ధ్వజమెత్తారు. రాయదుర్గం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గురువారం గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని రచ్చబండపై ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నేతలు మాట్లాడారు. ముందుగా మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 68 వేల మంది పింఛన్లకు అర్హత ఉన్నారని అధికారిక లెక్కలు చెబుతుంటే , జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు మాత్రం 28 వేల మందికి మాత్రమే ఇస్తామని చెప్పడం సిగ్గుచేటన్నారు.
వాటిని కూడా మంత్రులు పాల్గొన్న జన్మభూమి కార్యక్రమంలో ఒకరికో, ఇద్దరికో ఇచ్చి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. 2013–14 సంవత్సరానికి రూ.1350 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ వస్తే జిల్లా రైతులకు మాత్రం ఇవ్వలేదని ఆరోపించారు. 2014–15లో రూ. 560 కోట్లకు గాను రూ.64 కోట్లు కూడా ఇవ్వకపోవడం చూస్తే వారికి రైతుల పట్ల ఉన్న కపట ప్రేమ అర్థమవుతోందన్నారు. అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినా నివారణ చర్యలను మాత్రం ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా రైతులు రూ.182 కోట్లు ప్రీమియం చెల్లిస్తే , ప్రభుత్వం మాత్రం 43 మండలాలకు ముష్టి రూ.360 కోట్లు విదిల్చిందని ధ్వజమెత్తారు. జిల్లా రైతులు వివిధ పంటలకు పెట్టిన పెట్టుబడులు రూ.4వేల కోట్లను రైతులకు చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ నాయకులు ఇసుక దందా, కంకర దందాతో జేబులు నింపుకుంటున్నారని విమర్శించారు.
చివరికి మట్టితో కూడా దందా చేయడం జుగుప్సాకరమన్నారు. అధికారులు కూడా అధికార పార్టీ నేతలకే అండగా నిలుస్తుండటం శోచనీయమన్నారు. జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తన కీర్తి ప్రతిష్టల కోసం విదేశాలు తిరుగుతూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కళ్యాణదుర్గం తిప్పేస్వామి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వాల్మీకి, కాపు కులస్తులను బాబు వంచించాడన్నారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి కృషి చేయాలని, చేతకాకపోతే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాయదుర్గం సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వర్షాభావం వల్ల కరువు తాండవిస్తుంటే ఉపాధి పనులను సైతం యంత్రాలతో చేయించి టీడీపీ నాయకులు అక్రమార్జనకు పాల్పడుతున్నారని విమర్శించారు.
నియోజకవర్గంలో పనులు లేక వలసవెళ్లిన కూలీలు సుమారు 25 మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగుల బదిలీలకు మామూళ్లు వసూలు చేయడం ఎమ్మెల్యే ధన దాహానికి నిదర్శనమన్నారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన బీజేపీతో జతకట్టిన బాబు.. ప్రత్యేకహోదా సాధించడంలో విఫలమయ్యారన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబును బాగోతాన్ని చూసి... పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ఎద్దేవా చేశారు. హిందూపురం సమన్వయకర్త నవీన్ నిశ్చల్ మాట్లాడుతూ 33 నెలల పాలనలో బాబు సాధించిన ఘనత అవినీతిలో ఏపీని నెంబర్‌వన్ గా నిలపడమేన్నారు.